నిజామాబాద్, ఏప్రిల్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రేషన్ షాపుల్లో పంపిణీ చేసే సన్నబియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి అరవింద్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆందోళనకు గురిచేసి సమాజంలో అశాంతి సృష్టించాలనే దురుద్దేశంతో కొంతమంది సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జిల్లా పౌర సరఫరాల అధికారి తెలిపారు.
గోదావరిఖని పెద్దపల్లి జిల్లా లోని తిలక్ నగర్‌లో పంపిణీ చేసే సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలిసాయని ఫేస్‌బుక్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాలలో కొన్ని వీడియోలు ప్రచారం చేశారని, దీనిపై స్పందించి జిల్లా పౌర సరఫరాల శాఖ స్పందించి తిలక్ నగర్ ప్రాంతంలోని ఎక్కడ ఎటువంటి ప్లాస్టిక్ బియ్యం సరఫరా లేదని తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిసినది.
కావున ప్రజలను భయాందోళనలకు గురి చేస్తూ సమాజంలో అశాంతిని సృష్టించాలని దురుద్దేశంతో తప్పుడు వీడియోలను సామాజిక మాద్యాలలో ప్రచారం చేసినయెడల సంబంధిత అకౌంట్ హోల్డర్ల పై చట్టరీత్యా చర్యలు తీసుకోవటం జరుగుతాయన్నారు.
సన్నబియ్యం పథకంపై ప్రజలలో ఆందోళన సృష్టించేలా తప్పుడు ప్రచారాలు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.