భీమ్‌గల్, ఏప్రిల్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం భీమ్‌గల్ పట్టణంలోని సహస్ర ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెక్కులు పంపిణీ చేశారు. ఆయా మండలాలకు చెందిన 867 మందికి ఒక్కొక్కరికి లక్షా 116 రూపాయల విలువ చేసే చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి జూపల్లి ప్రస్తావిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ వాటి ద్వారా లబ్ది పొందేలా చూడాలని అధికారులకు సూచించారు. కాగా, ప్రతి ఒక్కరు తమ దైనందిన జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని, యోగా, వ్యాయామానికి తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయిస్తూ ఆరోగ్యాలను పరిరక్షించుకోవాలని మంత్రి జూపల్లి హితవు పలికారు.
అనవసర ఆడంబరాలకు పోయి వేడుకల పేరుతో కష్టార్జితాన్ని వృధా చేసుకోకూడని, నిష్ణాతులైన ఉపాధ్యాయులు, నాణ్యమైన బోధన అందిస్తున్న ప్రభుత్వ బడులలో పిల్లలను చదివిస్తూ డబ్బులను ఆదా చేసుకోవాలని జాగ్రత్తలు సూచించారు. కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్మూర్ ఆర్డీఓ రాజా గౌడ్, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్దిదారులు పాల్గొన్నారు.