నిజామాబాద్, ఏప్రిల్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతంనగర్ లో సన్న బియ్యం లబ్ధిదారుడైన దళిత వర్గానికి చెందిన లింబాద్రి, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ శనివారం సన్న బియ్యంతో వండిన అన్నంతో సహపంక్తి భోజనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారుడిని, కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండడం పట్ల లబ్ధిదారులు తమ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, పేద, సామాన్య ప్రజలు కూడా సన్న బియ్యంతో కడుపు నిండా భోజనం చేయాలనే బృహత్తర సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ప్రతీ నెల ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అందిస్తుండడం ఎంతో గొప్ప విషయం అని అన్నారు.
ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయంతో నిరుపేదల్లో ఎంతో సంతోషం వ్యక్తం అవుతోందని అన్నారు. సన్న బియ్యం లబ్ధిదారుడు లింబాద్రి, అతని కుటుంబంతో కలిసి సహపంక్తి భోజనం చేయడం తనకు ఎంతో సంతృప్తి కలిగించిందని అన్నారు. సన్న బియ్యం పంపిణీ చేయాలని సాహసోపేత నిర్ణయం తీసుకుని విజయవంతంగా అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ఈ సందర్భంగా మైనార్టీస్ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ అభినందనలు ప్రకటిస్తూ. హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన చంద్రశేఖర్ కాలనీలోని 31వ నెంబర్ రేషన్ దుకాణాన్ని సందర్శించి, లబ్దిదారులకు స్వయంగా సన్న బియ్యం పంపిణీ చేశారు.
కార్యక్రమాలలో జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారిణి నిర్మల, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, జిల్లా పౌర సరఫరాల శాఖ డీ.టీ నిఖిల్, రేషన్ డీలర్ గంగామణి, డివిజన్ ఇంచార్జ్ షాకిర్, రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.