నిజామాబాద్, ఆగష్టు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఏ కేంద్రంలో కూడా యూరియా స్టాక్ లేదనే మాట ఎక్కడ రాకూడదని అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు.
గురువారం ఆయన సెల్ కాన్ఫరెన్సు ద్వారా వ్యవసాయ, రెవెన్యూ, సహకార శాఖల అధికారులతో యూరియా సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు వచ్చిన యూరియాను అవసరానికి అనుగుణంగా డీలర్లకు, సహకార సంఘాలకు సరఫరా జరిగే విధంగా చూడాలని ఎక్కడ కూడా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
రైతులు ఆందోళన చెందే పరిస్థితి రాకుండా, పెద్ద లైన్లలో నిలబడే ఇబ్బంది లేకుండా టోకెన్లు ఇచ్చి వారు ఎప్పుడు ఎరువు తీసుకోవాలో అప్పుడు రావాలని సూచించాలని తెలిపారు. వారు వచ్చే కేంద్రంలో ఎరువు అందుబాటులో లేకుంటే దానికి దగ్గరగా ఎవరి వద్ద ఎరువు ఉంటుందో ఆ కేంద్రానికి పంపించాలని సూచించారు.
జీరో స్టాకు అనే మాట ఎక్కడా విన పడకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మండల స్థాయి వ్యవసాయ అధికారులు వారి పరిధిలోని కేంద్రాలలో నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రైతులకు ఆ వివరాలు తెలిసేలా స్టాక్ ఉన్న చోటికి వెళ్లే విధంగా అవగాహన కల్పించాలని, మీడియా ద్వారా సమాచారం అందించాలని తెలిపారు.
శుక్రవారం ఆర్‌సిఎఫ్ ద్వారా మరో ఏడు వందల మెట్రిక్ టన్నులు ఉన్నదని వచ్చే ఏడాది నేరుగా కేంద్రాలకు వెళ్లే విధంగా మార్క్‌ఫెడ్ అధికారులు చూడాలని తెలిపారు. కాన్ఫరెన్సులో జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, సహకార అధికారి సింహాచలం, మండల వ్యవసాయ అధికారులు, డిఎం / మార్క్ ఫెడ్, బోధన్ ఆర్డిఓ రాజేశ్వర్, ఏడిఏలు, తదితరులు పాల్గొన్నారు.