నిజామాబాద్, ఏప్రిల్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భూ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తూ, రైతుల భూములకు పూర్తి భరోసా కల్పించేందుకే ప్రభుత్వం నూతనంగా భూభారతి చట్టం తెచ్చిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. భూభారతి (భూమి హక్కుల రికార్డు చట్టం)-2025 పై శనివారం వర్ని , రుద్రూర్ రైతు వేదికలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల కోసం ప్రత్యేకించి రైతులకు వారి భూములకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉంటే వాటిని తొలగించి, భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. ధరణి పోర్టల్లో లేని అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభించునుందని సూచించారు. ధరణిలోని వివరాల ప్రకారం భూభారతి రికార్డులలో వాటిని నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. అయితే, రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలపై అర్జీలు అందించవచ్చని సూచించారు.
ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరం ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి వచ్చేదని అన్నారు. భూ సమస్యలు పరిష్కరిస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే భూ భారతి చట్టం ప్రకారం అప్పీలు చేసుకునే అవకాశం కూడా ఉందని అన్నారు. తహసీల్దార్ స్థాయిలో దరఖాస్తు చేసుకుంటే న్యాయం జరగలేదని భావిస్తే ఆర్డీఓకు, అక్కడ కూడా సంతృప్తి చెందకపోతే కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు.
భూభారతి ద్వారా కింది స్థాయి అధికారులకు కూడా బాధ్యతలు అప్పగించారని, దీనివల్ల భూమికి సంబంధించిన చిన్నచిన్న సమస్యలు మండల స్థాయిలోనే సత్వరం పరిష్కారం అవుతాయని కలెక్టర్ అన్నారు. ధరణిలో సవరణకు, సమస్యల పరిష్కారానికి, కింది స్థాయి అధికారులకు ఎటువంటి అధికారాలు లేనందున వేల సంఖ్యలో దరఖాస్తులు పెండిరగ్ ఉండేవని గుర్తు చేశారు.

ధరణిలో భూ సమస్యలపై దరఖాస్తు చేసుకునేందుకు 33 మాడ్యూల్స్ ఉండడం వల్ల ఇబ్బందులు పడేవారని, భూభారతిలో కేవలం నాలుగు మాడ్యూల్స్ మాత్రమే ఉండి సులభమైన పద్ధతిలో దరఖాస్తు ప్రక్రియ ఉంటుందని అన్నారు. భూములకు సంబంధించిన అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని, ఇదివరకటి ధరణిలో ఇలాంటి అవకాశం ఉండేది కాదన్నారు.
భూభారతి చట్టం వల్ల రైతులకు, పేదలకు ఎంతో మేలు కలుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం అన్ని కోణాలలో, మేధోమథనం చేసిన మీదట సమగ్ర అంశాలను పొందుపరుస్తూ భూభారతి చట్టానికి రూపకల్పన చేయడం జరిగిందన్నారు. భూ సమస్యలను నిర్దిష్ట గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.
అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, భూభారతి చట్టంలోని సెక్షన్లు, వాటి వివరాలపై రైతులకు సవివరంగా అవగాహన కల్పించారు. ఏదైనా సమస్య పరిష్కారం కాకుంటే భూభారతిలో అప్పీల్ వ్యవస్థ ఉందని, అప్పీలు చేసుకున్న పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తారని అన్నారు. ఈ. చట్టం ద్వారా రైతులకు వారి భూముల వివరాలతో కూడిన ఆధార్ తరహాలో భూధార్ సంఖ్యను కేటాయిస్తారని తెలిపారు. భూ సమస్యలు తెలుసుకుని సులభతరంగా పరిష్కరించేందుకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయేతర, మిగితా అన్ని రకాల భూముల రికార్డులు రెవెన్యూ కార్యాలయంలో నమోదు అయి ఉంటాయని అన్నారు.
భూ వివరాలతో పాటు భూమి హద్దులతో కూడిన సర్వే మ్యాప్ పట్టా పాస్ పుస్తకానికి జత చేయబడుతుందని సూచించారు. అసైన్ మెంట్ భూములకు సంబంధించి కూడా త్వరలోనే ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలను జారీ చేయనుందని తెలిపారు. అనంతరం ఆయా అంశాలపై రైతులు వెలిబుచ్చిన సందేహాలను కలెక్టర్, అదనపు కలెక్టర్ లు నివృత్తి చేశారు. భూభారతి చట్టంలో ఇంకా ఎలాంటి అంశాలు చేరిస్తే బాగుంటుందనే దానిపై రైతులు సలహాలు, సూచనలు చేయవచ్చని సూచించారు. ఈ సదస్సులలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు.