నిజామాబాద్, ఏప్రిల్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భూ భారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతీ మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మంగళవారం ముప్కాల్ మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూ భారతి చట్టం 14 ఏప్రిల్ 2025న ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
చట్టం పై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ధరణి స్థానంలో కొత్తగా భూభారతి (భూమి హక్కుల చట్టం) తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఇందులో అన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయని, హక్కుల రికార్డులలో తప్పుల సవరణ చేసుకోవచ్చని, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే, పెండిరగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం జరుగుతుందని సూచించారు. 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి, గడచిన 12 ఏండ్లుగా అనుభవంలో ఉంటూ 12.10.2020 నుండి 10.11.2020 మధ్య కాలంలో క్రమబద్దీకరణ కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీఓ లు విచారణ చేసి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని తెలిపారు.
అట్టి వాటిని రికార్డు లలో నమోదు చేసి పట్టాదారు పాసు పుస్తకం ఇస్తారని తెలిపారు. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ, పాసు పుస్తకాలలో భూమి పటం, భూముల సమస్యలు పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంటుందని తెలిపారు. తహసీల్దార్ చేసిన మ్యుటేషన్లపై లేదా జారీచేసిన పాసుపుస్తకాలపై అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓ కు అప్పీలు చేసుకోవచ్చని, ఆర్డీఓ ఇచ్చిన తీర్పు పై అభ్యంతరం ఉంటే జిల్లా కలెక్టర్ కు అప్పీలు చేసుకోవచ్చని, కలెక్టర్ ఇచ్చిన తీర్పు పై అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్ కు అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు.
భూదార్ కార్డుల జారీ, రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ చట్టంలో ఏమైనా అభ్యంతరాలు, అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చని అన్నారు. సాదా బైనామాలు, వారసత్వంగా వచ్చిన భూములపై 30 రోజుల్లోగా విచారణ చేయడం జరుగుతుందని, ఒకవేళ అట్టి గడువులోగా విచారణ చేయని పక్షంలో రిజిస్ట్రేషన్ అయినట్లుగా భావించవచ్చని తెలిపారు.
ప్రజలు ఈ చట్టం పై అవగాహన ఏర్పర్చుకోవాలని, వారికి ఉన్న భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం మే మొదటి వారం నుండి గ్రామాలలో సదస్సులు నిర్వహించేందుకు వచ్చే అధికారులకు అర్జీలు సమర్పించవచ్చని సూచించారు. కాగా, అంతకుముందు మెండోరా మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పాల్గొని రైతులకు భుభారతి చట్టంలోని కీలక అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సదస్సులలో రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆర్మూర్ ఆర్డీఓ రాజా గౌడ్, స్పెషల్ ఆఫీసర్ స్రవంతి, స్థానిక అధికారులు పాల్గొన్నారు.