నిజామాబాద్, ఏప్రిల్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి (ఆర్.ఓ.ఆర్ – 2025) నూతన చట్టం ద్వారా భూ వివాదాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఆధార్ తరహాలోనే భూ కమతాలకు భూదార్ నెంబర్లను కేటాయించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిర్దిష్ట గడువులోపు భూ సమస్యలు పరిష్కారం అయ్యేందుకు ఈ చట్టం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్, నందిపేట, ఆర్మూర్ మండల కేంద్రాలలో శనివారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు.
ఈ సదస్సులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ హాజరై భూభారతి చట్టంతో రైతులకు కలిగే ప్రయోజనాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సవివరంగా తెలియజేశారు. ఇదివరకు అమలులో ఉన్న ధరణితో పోలిస్తే, రైతు ప్రయోజనాలే ధ్యేయంగా ప్రభుత్వం అనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ భూభారతి చట్టం తెచ్చిందని అన్నారు. భూధార్ నెంబర్ కేటాయిపు వల్ల భూ ఆక్రమణలకు, అనవసర వివాదాలకు అవకాశం ఉండదని, రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు, భరోసా లభిస్తుందని అన్నారు.
భూముల రికార్డులలోని పొరపాట్లను పరిష్కరించేందుకు ధరణిలో అవకాశం ఉండేది కాదని, ప్రస్తుతం భూభారతి చట్టం ద్వారా అలాంటి సమస్యలు పరిష్కరించుకునే వెసులుబాటు కల్పిస్తూ నూతన చట్టంలో అవకాశం కల్పించారని తెలిపారు. ఈ చట్టం అమలులోకి వచ్చిన ఏడాది కాలం లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వాటిని తహసీల్దార్, ఆర్డీఓ స్థాయిలలో పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. మే, జూన్ మాసాలలో గ్రామాల వారీగా అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహించి, భూ సమస్యలు ఉన్న రైతుల నుంచి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు.

భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆ అర్జీలను 60 రోజుల వ్యవధిలో పరిష్కరిస్తారని సూచించారు. ఒకవేళ రైతులు సంతృప్తి చెందకపోతే కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం భూభారతి చట్టంలో రెండంచెల అప్పీలు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు.
గతంలో ధరణి వల్ల భూ వివాదాల పరిష్కారం కోసం సివిల్ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడే వారన్నారు. కానీ భూభారతి చట్టంలో రెండంచెల అప్పీలు వ్యవస్థ, రెవెన్యూ కోర్టుల వల్ల చాలా వరకు భూ సమస్యలు తహసీల్దార్, ఆర్డీఓ స్థాయిలోనే పరిష్కారం అవుతాయని అన్నారు.
రెండంచెల అప్పీలు వ్యవస్థతో పాటు సీసీఎల్ఏ కు రివిజన్ అధికారాలు కల్పించారని సూచించారు. అప్పీలు చేసుకున్న చిన్న, సన్నకారు, పేద వర్గాల వారికి ఉచిత న్యాయ సేవలు కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. గతంలో రికార్డులు చూసి రిజిస్ట్రేషన్లు చేసేవారని, కొత్త ఆర్ఓఆర్ చట్టంలో తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమగ్ర విచారణ జరిపిన తరువాతనే రిజిస్ట్రేషన్లు చేస్తారని అన్నారు. భవిష్యత్తులో వివాదాలకు ఆస్కారం లేకుండా పట్టాదారు పాసు పుస్తకాల్లో సమగ్ర వివరాలతో హద్దులను పేర్కొంటూ భూమి పటం (మ్యాపు) పొందుపరుస్తారని వివరించారు.
ఈ చట్టంలో నివాస స్థలాలు, గ్రామకంఠం, ఆబాది స్థలాలు, వ్యవసాయేతర భూముల వివరాలను కూడా పొందుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం నుంచి పెండిరగ్ లో ఉన్న సుమారు 9 లక్షల సాదాబైనామా దరఖాస్తులకు భూభారతి చట్టం ద్వారా క్రమబద్దీకరించుకునే అవకాశం ఏర్పడిరదని, హై కోర్టు విధించిన స్టే ఉత్తర్వులు తొలగిన మీదట వీటిని క్రమబద్ధీకరించేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయనున్నదని కలెక్టర్ వివరించారు. ప్రతీ సంవత్సరం డిసెంబర్ 31న రికార్డుల ఆధునీకరణ చేస్తారని అన్నారు. భూ సమస్యలు ఉన్న రైతులు భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ నూతన చట్టంపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు.
అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ,17 రాష్ట్రాలలో నిపుణులు సమగ్ర అధ్యయనం చేసి, అన్ని రకాల భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఉపయుక్తంగా ఉండేలా ప్రభుత్వం భుభారతి నూతన చట్టం రూపొందించిందని తెలిపారు. ధరణి పోర్టల్ కారణంగా భూ సమస్యలు పెరిగిపోయాయని అన్నారు. అప్పుడు కేవలం భూ సమస్యలను పరిష్కరించే అధికారం కలెక్టర్ కి ఉండేదని, నూతన చట్టంతో అధికార వికేంద్రీకరణ జరిగి కింది స్థాయి అధికారులకు కూడా అధికారాలు కల్పించారని తెలిపారు.
ఏవైనా భూసమస్యలు ఉంటే తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని రైతులకు సూచించారు. నిర్ణీత గడువు లోపు దరఖాస్తులను పరిష్కరిస్తారని అన్నారు.
ఈ సందర్భంగా పలువురు రైతుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు.
సదస్సులలో నిజామాబాద్ ఇంచార్జి ఆర్డీఓ స్రవంతి, ఆర్మూర్ ఆర్డీఓ రాజా గౌడ్, మార్కెట్ కమిటీలు, పీఏసీఎస్ చైర్మన్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.