నిజామాబాద్, ఏప్రిల్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రైతు ప్రయోజనాలే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో భూ వివాదాలు శాశ్వత పరిష్కారం అవుతాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ధరణితో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేయాలన్న కృత నిశ్చయంతో నిపుణులచే 17 రాష్ట్రాలలో అధ్యయనం జరిపించిన మీదట సమగ్ర అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్‌ఓఆర్ చట్టాన్ని రూపొందించారని తెలిపారు. ఈ చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతీ మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు.
సోమవారం రెంజల్, ఎడపల్లి మండల కేంద్రాలలోని రైతు వేదికలలో నిర్వహించిన అవగాహన సదస్సులలో కలెక్టర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధరణి స్థానంలో కొత్తగా భూభారతి (భూమి హక్కుల చట్టం) తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఇందులో అన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయని, హక్కుల రికార్డులలో తప్పులను సవరణ చేసుకోవచ్చని, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే, పెండిరగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం జరుగుతుందని సూచించారు.
2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి, గడచిన 12 ఏండ్లుగా అనుభవంలో ఉంటూ, 12.10.2020 నుండి 10.11.2020 మధ్య కాలంలో క్రమబద్దీకరణ కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీఓ లు విచారణ చేసి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని తెలిపారు. వాటిని రికార్డు లలో నమోదు చేసి పట్టాదారు పాసు పుస్తకం ఇస్తారని తెలిపారు. ధరణిలో సాదా బైనామాల క్రమబద్దీకరణకు అవకాశం ఉండేది కాదన్నారు. దీంతో హైకోర్టు స్టే విధించిందని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల వరకు పెండిరగ్ లో ఉన్న సాదా బైనామాల క్రమబద్దీకరణకు ప్రస్తుత భూభారతి చట్టం ద్వారా పరిష్కరించుకునే వెసులుబాటు లభిస్తోందని, హైకోర్టు స్టే తొలగిన మీదట ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనున్నదని కలెక్టర్ వివరించారు. కాగా, వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ, పాసు పుస్తకాలలో భూమి పటం, భూముల సమస్యలు పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంటుందని తెలిపారు. తహసీల్దార్ చేసిన మ్యుటేషన్లపై లేదా జారీ చేసిన పాసు పుస్తకాలపై అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓ కు అప్పీలు చేసుకోవచ్చని, ఆర్డీఓ ఇచ్చిన తీర్పు పై అభ్యంతరం ఉంటే జిల్లా కలెక్టర్ కు అప్పీలు చేసుకోవచ్చని సూచించారు.

కలెక్టర్ ఇచ్చిన తీర్పు పై అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్ కు కూడా అప్పీలు చేసుకోవచ్చని అన్నారు. అప్పీలు చేసుకున్న పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తారని తెలిపారు. ఈ తరహా తోడ్పాటు దేశంలోనే మరెక్కడా లేదని అన్నారు. భూ వివాదాలు, ఆక్రమణలకు తావు లేకుండా భూ కమతాలకు ఆధార్ తరహాలోనే
భూదార్ నెంబర్ ను కేటాయిస్తారని తెలిపారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికార వికేంద్రీకరణకు ప్రాధాన్యతనిస్తూ తహసీల్దార్, ఆర్డీఓలకు మ్యుటేషన్ చేసే అధికారాలను ప్రభుత్వం కల్పించిందని అన్నారు.
భూముల కొనుగోలు, దానం, తనఖా, బదిలీ, భాగ పంపకాలకు సంబంధించి స్లాట్ బుక్ చేసుకుని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే, అసైన్డ్, పీ.ఓ.టీ, ప్రభుత్వ భూములు కావని నిర్ధారించుకున్న మీదట గడువు లోపు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. వారసత్వ వీలునామా కింద కూడా మ్యుటేషన్ చేసే అధికారాలను తహసీల్దార్లకు కల్పించారని అన్నారు. అయితే క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపిన మీదట వారసత్వ వీలునామా రిజిస్ట్రేషన్ చేస్తారని సూచించారు. భూ వివాదాల సత్వర పరిష్కారం కోసం భూభారతి ద్వారా ఇదివరకటి తరహాలోనే రెవెన్యూ కోర్టులను పునరుద్ధరించారని తెలిపారు.
భూములకు సంబంధించిన సమగ్ర వివరాలు, హద్దులతో పట్టా పాస్ బుక్కులకు మ్యాప్ లను జత చేస్తారని అన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్ తో సర్వే చేయించి సమర్పించే మ్యాప్ లను సర్వేయర్ పరిశీలించి, పట్టా పాస్ పుస్తకంలో నమోదు చేయడం జరుగుతుందన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయేతర, ఆబాదీ భూముల వివరాలతో కూడిన రికార్డులను కూడా నిర్వహిస్తారని తెలిపారు.
భూముల రికార్డులకు సంబంధించి ఏవైనా పొరపాట్లు ఉంటే, రైతులు ఈ చట్టం ప్రవేశపెట్టిన ఏడాది కాలంలోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మే, జూన్ మాసాలలో గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించేందుకు వచ్చే అధికారులకు అర్జీలు సమర్పించవచ్చని సూచించారు. ధరణి పోర్టల్ ద్వారా ఆన్లైన్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ రైతులకు భుభారతి చట్టంలోని కీలక అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సదస్సులలో స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు.