నిజామాబాద్, మే 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సమగ్ర అధ్యయనం జరిపిన మీదట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావుతో కలిసి మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్ష ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏప్రిల్ 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో నిర్వహించిన మాదిరిగానే ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు 28 జిల్లాల్లోని 28 మండలాల్లో పైలట్ ప్రాతిపదికన రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని సూచించారు. తహసీల్దార్ల నేతృత్వంలో ప్రతి మండలానికి రెండు బృందాలను నియమించాలని, ప్రతీ బృందంలో తహసీల్దార్, సర్వేయర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తప్పనిసరిగా ఉండేలా చూడాలని, ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ బృందాలు నిర్దేశిత గ్రామంలోనే ఉంటూ భూ సమస్యలపై ప్రజలు, రైతుల నుండి అర్జీలు స్వీకరించాలన్నారు.
రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను ఈ నెల 31వ తేదీ వరకు పరిష్కరించాలని, పరిష్కారం కాని వాటికి ఎందుకు పరిష్కరించడం లేదనే విషయాన్నిలిఖిత పూర్వకంగా తెలియజేస్తూ దరఖాస్తును తిరస్కరించాలని తెలిపారు. ప్రభుత్వ భూముల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డులలో నమోదు చేయాలని, అసైన్డ్ ల్యాండ్లకు సంబంధించి పొజిషన్ మీద ఉండి పట్టా లేనివారు, పట్టా ఉండి పొజిషన్ మీద లేనివారి వివరాలను సేకరించాలని సూచించారు. కబ్జాలకు, అన్యాక్రాంతానికి గురైన ప్రభుత్వ భూలను సైతం గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకుని పక్కాగా వాటి వివరాలను రికార్డులలో పొందుపర్చాలని ఆదేశించారు.
కాగా, భూభారతి నూతన చట్టంపై రాష్ట్రంలో 605 మండలాలకు గాను ఇప్పటివరకు 590 మండలాల్లో అవగాహన సదస్సులను నిర్వహించడం జరిగిందని, 85,527 మంది పౌరులు, 1,62,577 మంది రైతులు అవగాహన సదస్సులలో పాల్గొన్నారని మంత్రి వివరించారు. ఇదిలాఉండగా, ఇందిరమ్మ ఇండ్ల పధకంలో భాగంగా ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇండ్లకు గాను లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లకు సూచించారు. అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసిన వెంటనే ఏరోజుకు ఆ రోజు జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు జాబితాను పంపి వారి ఆమోదం తీసుకోవాలని, ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతంలో కనీసం 500 ఇండ్లను కేటాయించి లబ్దిదారులను ఎంపిక చేయాలని సూచించారు.
లబ్ధిదారుల ఎంపికలో అత్యంత పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకూడదని స్పష్టం చేశారు.అనర్హులని తేలితే ఇండ్ల నిర్మాణం మధ్యలో ఉన్నాకూడా రద్దు చేస్తామన్నారు. లబ్ధిదారుల చెక్ లిస్ట్ ను మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓ లు తమ అధీనంలో జాగ్రత్తగా భద్రపర్చాలని అన్నారు. లబ్ధిదారులు ఇంటిని 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మాణం చేపట్టేలా చూడాలన్నారు.
అధికారులు క్షేత్రస్థాయి పర్యవేక్షణ జరుపుతూ, మంజూరీ తెలుపబడిన ప్రతి లబ్ధిదారుడు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి నిర్ణీత గడువులోపు పూర్తి చేసుకునేలా అధికారులు క్షేత్రస్థాయి పర్యవేక్షణ జరపాలన్నారు. అదే సమయంలో నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో ఇంటి నిర్మాణ పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని, ఈ మేరకు ఏ.ఈ స్థాయి అధికారులను ప్రతి మండలానికి ఒకరు చొప్పున కేటాయిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇంటి నిర్మాణ దశలను బట్టి తక్షణమే లబ్ధిదారుల ఖాతాలలోకి ఇందిరమ్మ ఇళ్ల పథకం డబ్బులను జమ చేయాలని సూచించారు.
కాగా, ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జరగనున్ననీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి పొంగులేటి అధికారులకు సూచించారు. ఈ ఏడాది రాష్ట్రం నుండి 72,572 మంది విద్యార్దులు నీట్ పరీక్షకు హాజరవుతున్నారని ఇందుకోసం 24 జిల్లాలలో 190 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటితో పాటు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్ లను అందుబాటులో ఉంచాలన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, జిల్లాలో 3398 మంది పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. అభ్యర్థుల శాఖకు అనుగుణంగా మొత్తం 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో నాలుగు, డిచ్పల్లి, బోధన్ లలో రెండు చొప్పున ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు పరీక్ష ప్రారంభం అయ్యే సమయానికి కనీసం అరగంట ముందే లోనికి చేరుకోవాల్సి ఉన్నందున, ఈ విషయం అవగాహన కల్పించామని అన్నారు.
స్ట్రాంగ్ రూమ్ల నుండి ప్రశ్న పత్రాలు, పరీక్ష సామాగ్రిని పకడ్బందీ పోలీస్ బందోబస్తు మధ్య తరలింపు, పరీక్షా కేంద్రాలలో తాగునీరు, ఏ.ఎన్.ఎం బృందాలను అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో పోలీస్ కమిషనర్ సాయిచైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.