నిజామాబాద్, మే 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
2024 – 25 విద్యా సంవత్సరం మార్చి నెలలో జరిగిన ఇంటర్ వార్షిక పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రణాళికను రూపొందించి ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ఇంటర్ బోర్డు ప్రత్యేక అధికారి ఒడ్డేన్న అన్నారు. రాష్ట్ర ఇంటర్ కమిషనర్ హైదరాబాద్ ఇంటర్ విద్య అధికారి ఒడ్డెన్నను జిల్లా ప్రత్యేక అధికారిగా నియమించారు. కమీషనర్ ఆదేశం మేరకు శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్య అధికారి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నిజామాబాద్ ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్‌లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఒడ్డెన్న మాట్లాడుతూ మే 20వ తేదీ వరకు జరగబోయే ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు 15 రోజుల ప్రత్యేక ప్రణాళికను రూపొందించి, ఫెయిల్ అయిన ప్రతి విద్యార్థి పాస్ కావడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని బోధిస్తూ వారందరూ వంద శాతం పాసయ్యే విధంగా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.
ప్రత్యక్ష తరగతులు లేదా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఒక సబ్జెక్టు, రెండు సబ్జెక్టులు, మూడు సబ్జెక్టులలో ఫెయిల్ అయిన విద్యార్థుల జాబితాలను రూపొందించి ప్రత్యేకంగా వారందరికీ సమాచారం అందజేసి ప్రత్యేక తరగతులను నిర్వహించాలని అన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల హాజరు తరగతుల నిర్వహణపై సమీక్ష నిర్వహించి నివేదికలు అందజేయడం జరుగుతుందని ప్రత్యేక అధికారి ఒడ్డెన్న తెలిపారు.
జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్ని సబ్జెక్టుల సంబంచిన అధ్యాపకులు కళాశాలకు హాజరై ఫెయిల్ అయిన విద్యార్థుల జాబితా సేకరించి వారందరికీ సమాచారం అందజేసి తరగతులకు హాజరయ్యేట్లు ప్రిన్సిపాల్‌లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.
అలాగే ఇంటర్మీడియట్ అడ్మిషన్ షెడ్యూలు విడుదల అయిందని ప్రతి ప్రిన్సిపాల్ పదవ తరగతి పాసైన విద్యార్థుల జాబితాలను సేకరించి ప్రత్యక్షంగా విద్యార్థులను కలుస్తూ వారిని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించేందుకు ప్రణాళికను రూపొందించాలని అన్నారు. ప్రతి అధ్యాపకుడు తన కళాశాల పరిధిలోని ప్రభుత్వ, పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలు సందర్శించి విద్యార్థులను చేర్పించేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అకాడమిక్ సెల్ ఆర్గనైజర్ నరసయ్య, జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్‌లు పాల్గొన్నారు.