నిజామాబాద్, మే 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా కేంద్రంలోని నగర పాలక సంస్థ పాత భవనంలో కొనసాగుతున్న వెల్ నెస్ సెంటర్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం సందర్శించారు. నుడా చైర్మన్ కేశ వేణు, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్‌లతో కలిసి వెల్ నెస్ సెంటర్‌లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఆరోగ్య పరీక్షలు, చికిత్స కోసం వచ్చే రిటైర్డ్ ఉద్యోగులకు తగు సదుపాయాలు అందుబాటులో ఉండేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా వెయిటింగ్ హాల్‌తో పాటు స్త్రీ, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్స్, ఔషధాలను పంపిణీ చేసే గదులను అందుబాటులోకి తేవాలని, వెల్ నెస్ సెంటర్ కు ఆనుకుని ఉన్న గదులకు మరమ్మతులు చేయడంతో పాటు కొత్తగా వెయిటింగ్ హాల్ నిర్మించాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని, పనులను సత్వరమే చేపట్టి పూర్తి చేయాలని అన్నారు. వెల్ నెస్ సెంటర్ ద్వారా రిటైర్డ్ ఉద్యోగులకు, పాత్రికేయులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.
అనంతరం రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనాన్ని కలెక్టర్ సందర్శించారు. సమావేశ మందిరం, పార్కింగ్ కోసం స్థలం కేటాయించాలని సంఘ ప్రతినిధులు కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఇంచార్జి ఆర్డీఓ స్రవంతి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు రవీందర్ రావు, భూమాగౌడ్, రామ్ మోహన్ రావు తదితరులు ఉన్నారు.