నిజామాబాద్, ఆగష్టు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన టిఎస్ బిపాస్ (భవనముల అనుమతి చట్టం) అత్యంత ముఖ్యమైనదని చట్టం ద్వారా అక్రమ నిర్మాణాలను తొలగించడమే కాకుండా అనుమతులకు దరఖాస్తు చేసిన వారికి నిర్ణీత సమయంలో అప్రూవల్ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
శనివారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో టిఎస్ బిపాస్ చట్టంపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 అడుగుల లోపు స్థలాలలో నిబంధనలను అనుసరించి ఇల్లు నిర్మించుకోవడానికి ప్రత్యేకంగా అనుమతులు జారీ చేసే అవసరం లేకుండా యజమానులకు పూర్తి స్వేఛ్ఛ ఇవ్వడం జరిగిందని అయితే ఇతర నిర్మాణాలు మాత్రం దరఖాస్తు చేసిన 15 రోజులలోగా సంబంధిత అధికారులు అనుమతులు తప్పనిసరిగా జారీ చేయవలసి ఉంటుందని లేదంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడానికి చట్టం అవకాశం కల్పించిందన్నారు.
దరఖాస్తు వచ్చిన 48 గంటలలోగా సంబంధిత టీమ్‌కు దరఖాస్తును ఫార్వర్డ్ చేయవలసి ఉంటుందని టీంల వారీగా అనుమతులకు వచ్చిన దరఖాస్తుల జాబితా సిద్ధం చేసుకోవాలని అనుమతులకై వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు క్షుణ్నంగా పరిశీలించాలని ఆ తర్వాతనే అప్రూవల్ చేయాలని స్పష్టం చేశారు.
అనుమతులు జారీ చేసే ముందు తప్పనిసరిగా ఆ స్థలాలను పరిశీలించాలని ప్రభుత్వ భూములు ఇరిగేషన్ భూములను కూడా ఆక్రమించి నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకుంటారని ఈ విషయంలో అత్యంత జాగ్రత్తతో తనిఖీలు నిర్వహించాలని ఇట్టి విషయంలో అనుమతులు జారీ కాకుండా చూడాలన్నారు. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఎక్కడ నిర్మాణాలు జరిగినా నోటీసులు అవసరం లేకుండా వాటిని కూలకొట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అంతే కాక అక్రమ నిర్మాణాలపై వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందించి విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు రాకుండా కూడా అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ అక్రమ నిర్మాణాల విషయంలో దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. పట్టణ ప్రకృతి వనాలలో పూర్తిస్థాయిలో మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు వాచ్ అండ్ వార్డ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జితేష్ బి పాటిల్, అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, తదితరులు పాల్గొన్నారు.