నిజామాబాద్, ఆగష్టు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 10వ తేదీలోగా 50 వేల లోపు పంట రుణాల వివరాలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి బ్యాంకు, వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ నుండి సెల్ కాన్పారెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో రైతులకు రూ. 50 వేల లోపు రుణమాఫీకి సంబంధించి వివరాలు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు. 1 ఏప్రిల్ 2014 – 11 డిసెంబర్ 2018 మధ్యకాలంలో 25 వేల పైన 50 వేల వరకు బ్యాంకుల నుండి పంట రుణాలు పొందిన రైతుల వివరాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఇందుకై అర్హులైన రైతులకు సంబంధించి వ్యాలిడిటీ అకౌంట్స్ పూర్తి వివరాలతో బ్యాంకు అధికారులను సంప్రదించి జాబితా సిద్ధం చేయాలని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన ఏవోలు, ఏపీఓలు వారి పరిధిలోని బ్యాంకు బ్రాంచ్‌ల మేనేజర్‌ని కలిసి వారి వద్ద కల వివరాలతో వీరి వివరాలను సరి పోల్చుకొని తప్పులు లేకుండా అర్హుల జాబితాను సిద్ధం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
సమయం లేనందున బ్యాంకులు వ్యవసాయ శాఖ అధికారులు ఈ పనుల పైననే దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. బ్యాంకు కంట్రోలింగ్ అధికారులు వారి బ్రాంచ్ అధికారులకు ఈ విషయమై ప్రభుత్వ నిబంధనలను తెలియజేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం జాబితాలు సిద్ధం చేయవలసినదిగా తెలపాలని అన్నారు. సెల్ కాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, ఎల్‌డిఎం సుధీంద్రబాబు వ్యవసాయ, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.