డిచ్‌పల్లి, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగంలోని పరిశోధకులు ఎం. రవీందర్‌కు పిహెచ్. డి. డాక్టరేట్ అవార్డ్ ప్రదానం చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.బి.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఎం. రవీందర్ ‘‘తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల సామాజిక, ఆర్థిక స్థితిగతులు – ప్రత్యేక అధ్యయనం, నిజామాబాద్ జిల్లాలోని లంబాడాలకు పరిమితం’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించి తెలంగాణ విశ్వవిద్యాలయానికి సమర్పించారు.
కాగా మంగళ వారం ఉదయం ఆన్ లైన్ (వర్చువల్) లో ఓపెన్ వైవా నిర్వహించారు. ఎక్సటర్నల్ ఎగ్జామినర్‌గా కాకతీయ విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగం ప్రొఫెసర్ కె. మనుజాదేవి హాజరై సిద్ధాంత గ్రంథంపై పలు ప్రశ్నలడిగారు. అత్యంత పేదరిక లంబాడి గిరిజన కూలి కుటుంబంలో పుట్టిన మాలావత్ రవీందర్ నాయక్ వెనుకబడిన గిరిజన జాతుల ఆర్థిక రాజకీయ, సామాజిక సమస్యలను తాను రూపొందించుకున్న ప్రశ్నావళి ద్వారా బయటకు తీసి, సరిjైున గణాంక పద్దతుల ద్వారా పరిష్కార మార్గాలను ప్రభుత్వానికి నివేదించడం అభినందనీయమని ఆచార్య మనుజాదేవి పరిశోధనపై సంతృప్తి వ్యక్తం చేసినారు.
ఓపెన్ వైవా కమిటికి చైర్మన్‌గా వ్యవహరించిన సోషల్ సైన్స్ డీన్ ఆచార్య కె.శివశంకర్ తండా వాసుల ఆర్థిక ఇబ్బందులను, వారి సాంఘిక అసమానతలను నివారించుటకు ఈ సిద్ధాంత గ్రంథం దిక్సూచిగా ఉపయోగపడుతుందని తెలిపారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలోనే ఎం. ఎ. అప్లైడ్ ఎకనామిక్స్ చదివి, పీజీ అనంతరం అడ్మిషన్స్ డైరక్టరేట్ ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రవీందర్ నాయక్‌కు పిహెచ్.డి. అవార్డు కావడం పట్ల ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీంలు హర్షం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాల్లో నిర్దిష్ట పరిశోధనల విస్తృతితోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేసి పరిశోధకుడు ఎం. రవీందర్‌ను, పర్యవేక్షకులు డా. బి. వెంకటేశ్వర్లను అభినందించారు.
తెలంగాణ విశ్వవిద్యాలయ మాజీ రిజిస్ట్రార్ ఆచార్య డి. అశోక్, ప్రిన్సిపాల్ డా. వాసం చంద్రశేఖర్ వైవా వోస్ కార్యక్రమంలో పాల్గొని పరిశోధకుడిని ప్రోత్సహించారు. కార్యక్రమానికి విభాగాధిపతి డా.బి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, పాఠ్య ప్రణాళిక అధ్యక్షులు, తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు సమన్వయం చేశారు. కార్యక్రమంలో అర్థశాస్త్ర అధ్యాపకులు డా. కె. రవీందర్ రెడ్డి, డా. ఏ. పున్నయ్య, డా. స్వప్న, టి. సంపత్, డా. శ్రీనివాస్, డా. దత్తహరి, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.