నిజామాబాద్, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాల అదాలత్ కార్యక్రమానికి సంబంధిత ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని 650 దరఖాస్తులు పలు సమస్యలపై స్వీకరించడం జరిగిందని కమిషన్ చైర్పర్సన్ శ్రీనివాస రావు తెలిపారు.
బాలల అదాలత్ అనంతరం ముగింపు కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదరం ధ్రువపత్రాలకై ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని, అదేవిధంగా హాస్టల్ సదుపాయాలకు, వైద్య సదుపాయాలకు కూడా దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. అనాధలు, దివ్యాంగులు దరఖాస్తులు అందించిన వారిలో ఉన్నారని, కరోనా ప్రభావిత కుటుంబాల వారు కూడా తమ సమస్యలపై దరఖాస్తులు అందించారని ఆయన పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని యంత్రాంగం ఈ సమస్యలపై వీలైనంత త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి జిల్లా యంత్రాంగానికి ఆయన అభినందనలు తెలిపారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులలో ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖలు క్షుణ్ణంగా పరిశీలించి ప్రత్యేక శ్రద్ధ కనబర్చి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
వాటిని పరిష్కరించినప్పుడే ఈ కార్యక్రమానికి ఫలితం లభించినట్లు అవుతుందని తెలిపారు. జిల్లాలో బాలల అదాలత్ ఏర్పాటు చేసినందుకు ఆయన చైర్ పర్సన్‌కు కమిషన్, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఇటువంటి ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో విజయవంతం చేయడానికి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
కార్యక్రమం పూర్తి చేయడంలో భాగస్వాములైన స్త్రీ శిశు సంక్షేమ శాఖ తోపాటు ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చైర్ పర్సన్‌కు కమిషన్ సభ్యులకు జ్ఞాపిక, శాలువాతో ఘనంగా సత్కారం నిర్వహించారు.