కామారెడ్డి, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా నూతన పరిశ్రమల స్థాపనకు చాల అనువుగా ఉంటుందని, అన్ని రకాల వనరులు ఉన్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.శరత్ తెలిపారు. మంగళవారం కేరళ రాష్ట్రానికి చెందిన కిటెక్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ హరికిషన్ సింగ్ సోధి, జనరల్ మేనేజర్ సాజి కొరియన్ కలెక్టర్ చాంబర్లో తనను కలుసుకున్నప్పుడు వారితో ఆయన మాట్లాడారు.
కామారెడ్డి జిల్లా నూతనంగా వచ్చే పరిశ్రమలకు అన్ని అవకాశాలతో అనుకూలంగా ఉందని, ఎలాంటి సమస్యలు లేవని, మానవ వనరుల శక్తి అందుబాటులో ఉంటుందని, కామారెడ్డి రైలు మార్గం కలిగి ఉందని, హైదరాబాద్ పట్టణానికి, ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా కామారెడ్డి కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉండటం వలన అదనపు వనరులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
పరిశ్రమ స్థాపనకు ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని తెలిపారు. కిటెక్స్ పరిశ్రమ ద్వారా కిడ్స్ గార్మెంట్స్ ఉత్పత్తి చేయడం జరుగుతుందని వారు కలెక్టర్కు తెలిపారు. కిటెక్స్ కంపెనీ ప్రతినిధుల వెంట రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కార్యాలయ అధికారి వెంకటశేఖర్, తెలంగాణ టెక్స్ టైల్స్ డైరెక్టర్ మిహిర పరేఖ్, కామారెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ ఎ.డి. రఘునాథ్, నిజామాబాద్, అసిస్టెంట్ జోనల్ మేనేజర్ దినేష్ వెంట ఉన్నారు.
అంతకు ముందు కంపెనీ ప్రతినిధులు ఎస్ ఎస్ నగర్, తాడువాయి మండలాల పరిధిల లోని లింగంపల్లి, కరాడ్ పల్లి గ్రామాలలోని టిఎస్ ఐఐసి ఆధ్వర్యంలోని ప్రభుత్వ స్థలాలను జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ డి. వెంకట మాధవరావు, స్థానిక తాసిల్దార్లతో కలిసి పరిశీలించారు.