డిచ్‌పల్లి, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగంలో పిహెచ్. డి. డాక్టరేట్ సాధించిన గిరిజన లంబాడా ముద్దు బిడ్డ మాలావత్ రవీందర్ నాయక్‌ను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ప్రశంసించారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ మాలావత్ రవీందర్ నాయక్ 2007 నుంచి తెలంగాణ విశ్వవిద్యాలయంలోనే ఎం. ఎ. అప్లైడ్ ఎకనామిక్స్ చదివారని, బాలుర వసతి గృహంలోనే ఉండి హాస్టల్ కమిటి మెంబర్‌గా విద్యార్థుల సమస్యలను పరిష్కరించేవాడని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థి జెఏసి లీడర్‌గా పాత్ర పోషించారని అన్నారు. పీజీ అనంతరం అడ్మిషన్స్ డైరెక్టరేట్ ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ తన నమ్మకాన్ని చాటుకుంటున్నారని అన్నారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. బి. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఎం. రవీందర్ ‘‘తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల సామాజిక, ఆర్థిక స్థితిగతులు – ప్రత్యేక అధ్యయనం : నిజామాబాద్ జిల్లాలోని లంబాడాలకు పరిమితం’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించడం పట్ల హర్షం ప్రకటించారు. ఈ పరిశోధన ఆరంభమని, ఇంకా సమగ్రమైన నివేదికలతో అర్థశాస్త్రంలో పురోగమించి ఉత్తమమైన, ప్రామాణికమైన పరిశోధనలు చేస్తూ ఉండాలని సూచించారు.