వేల్పూర్, ఆగష్టు 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ జక్కుల రాజేశ్వర్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ యొక్క ఆదాయ వ్యయాలను గ్రామ సభలో చదివి వినిపించారు. కరోనా నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలలో గ్రామస్తులందరు తప్పకుండా మాస్కులు ధరించాలని, మాస్కులు ధరించని వారికి 500 నుండి 1000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుందన్నారు.
గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకు వచ్చినట్లయితే పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రధాన కూడళ్ళలో, పాఠశాలలో, దేవాలయాలలో, చెరువు కట్టలపై, పంట పొలాల గట్లపైన మొక్కలు నాటి నీరుపోశారు.
గ్రామంలోని వాడలలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటి ముందు మూడు చెట్లను నాటి యజమాని బాధ్యత వహించాలని సూచించారు. మొక్కలను ఎవరైనా తొలగించినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఎంపీటీసీ నాగమణి మాట్లాడుతూ గ్రామంలో ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే తమ దృష్టికి తీసుకు రావాలని సమస్య పరిష్కరించే విధంగా పాలకవర్గంతో కలిసి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి భోజెందర్, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.