నిజామాబాద్, ఆగష్టు 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం సందర్భంగా ముఖ్యమైన శాఖలపై సభ్యులు చర్చించారు. మంగళవారం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా, సీఈవో గోవిందు, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డిఆర్‌డిఎ, వ్యవసాయం, వైద్య ఆరోగ్య శాఖ, మిషన్ భగీరథ, విద్యుత్, తదితర శాఖలపై అధికారులు వివరించగా సభ్యులు చర్చించారు. సభ ప్రారంభానికి ముందు కొత్తగా నియమించబడి మొదటిసారి జిల్లా పరిషత్ సమావేశానికి హాజరైన గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్‌ఎంబి రాజేశ్వర్, చైర్మన్, కలెక్టర్ ఇతర అధికారులు సన్మానించారు. జిల్లాకు స్థానిక సంస్థల అధికారిగా వచ్చి మొదటిసారి సమావేశమునకు హాజరైన చిత్ర మిశ్రాకు పుష్ప గుచ్చం అందించి ఆహ్వానించారు.
చైర్మన్ విట్టల్ రావు ప్రారంభ ఉపన్యాసం చేస్తూ రాష్ట్రంలోని జనాభాలో 80 శాతం మంది రైతులే ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం అన్ని సదుపాయాలు కల్పించడం ఎంతైనా సంతోషించదగ్గ విషయం అన్నారు. పెట్టుబడి సహాయం కింద రైతుబంధు దురదృష్టవశాత్తు రైతు చనిపోతే నామినీకి అందించే రైతు బీమా తదితర కార్యక్రమాలు రైతులకు ఎంతైనా అండ దండగా ఉన్నాయన్నారు. అదేవిధంగా కొత్తగా అమలు చేస్తున్న దళిత బంధు ద్వారా ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయల సహాయం విడతలవారీగా అందనున్నదని అన్నారు.
జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం పైగా కరోనా వల్ల అభివృద్ధి కార్యక్రమాల్లో కొంత వెనుకబాటు జరిగినందున ప్రస్తుతం కోవీడ్ తగ్గుముఖం పట్టడంవల్ల రోజుకు సుమారు 10 కేసులు వరకు నమోదు అవుతున్నాయని అందువల్ల ప్రస్తుతం జిల్లా యంత్రాంగం అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించవలసి ఉన్నదని పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై గట్టిగా ముందుకు వెళ్తున్నామని, ఆయా మండలాలకు చెందిన ఎంపీపీలు, జడ్పిటిసిలు కూడా ఈ కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి వాటిని పూర్తయ్యేలా చూడాలని కోరారు.
గత కొన్ని రోజులుగా జిల్లాలో సీజనల్ వ్యాధులు ఉన్నందున వాటిని కంట్రోల్ చేయుటకు పది పదిహేను రోజుల పాటు ప్రత్యేక శ్రద్ధ కనపడడానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల పనులను పర్యవేక్షించడం జిల్లాకు కొత్తగా అదనపు కలెక్టర్‌ను ఇచ్చినందున ఆమె ఈ పనులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తారు అని తెలిపారు. గ్రామీణ ఉపాధి పథకం శాఖ ద్వారా ఆసరా పెన్షన్‌లను 57 సంవత్సరాలు వయసు పూర్తి చేసుకున్న వారికి కూడా మంజూరు చేయనున్నందున అర్హులు అందరు ఈనెల 31లోగా సంబంధిత మీ సేవా కేంద్రాలలో పూర్తి వివరాలను ఉచితంగా నమోదు చేయించుకోవాలని సూచించారు. ఆ వివరాలు సంబంధిత లాగిన్‌కు వస్తాయని వాటిని అధికారులు పరిశీలించి అవసరమైన అప్రూవల్ చేసి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని తెలిపారు.
స్త్రీ నిధి ద్వారా 4 వేల పాడి పశువులను మహిళా సంఘాల సభ్యులకు రుణం ద్వారా అందించడానికి లబ్ధిదారులను గుర్తించి ఈ నెల చివరి వరకు వివరాలు అందించాలని తెలిపారు. ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ స్త్రీ నిధి ద్వారా పాడి పశువులతో పాటు ఇతర కుటీర పరిశ్రమలను కూడా ప్రోత్సహించడం ద్వారా గ్రామాలలో ఉపాధి లభించడంతోపాటు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు అని ప్రభుత్వం ఎన్నికల మానిఫెస్టో ద్వారా ఇచ్చిన హామీ కనుగుణంగా అర్హత గల ప్రతి ఒక్కరిని ఆసరా పెన్షన్‌కు ఎంపిక చేయాలని కోరారు.
మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలలో ఇంకెక్కడైనా పనులు పెండిరగ్ ఉంటే పూర్తిచేయాలని అదే విధంగా వైకుంఠ గ్రామాలు రైతు వేదికల కూడా మిషన్ భగీరథ నీటిని ఇచ్చే అవకాశం ఉంటే పరిశీలించాలని ఎమ్మెల్సీ ఈ సందర్భంగా అధికారులను కోరారు. 25 వేల నుండి 50 వేల లోపు పంట రుణాలు పొందిన వారికి ఈ రోజు నుండి వారి ఖాతాలలో రుణమాఫీ నిధులు జమ చేయనున్నామని ఈసారి పంటల సాగు 4.52 లక్షల ఎకరాలలో చేయనున్నందున ప్రధాన పంటల సాగు ఇప్పటికే మొదలయ్యాయని వరి 3.85 లక్షల ఎకరాలు సాగు దాటవచ్చని అనుకుంటున్నట్లు ఇందుకుగాను సరిపోయే విధంగా యూరియాను ఎప్పటికప్పుడు తెప్పిస్తున్నామని జిల్లాలో ఎరువుల కొరత లేదని రైతులు పరిమితి మేరకే యూరియా తీసుకొని ఇతర రైతులకు కూడా అవకాశం కల్పించాలని సభ్యులు, అధికారులు కోరారు.
రైతు బీమా ప్రారంభం అయినప్పటి నుండి ఇప్పటివరకు 127.8 కోట్ల రూపాయలు నామినిలకు అందించామన్నారు. జిల్లాలో 105 రైతు వేదికల ద్వారా అవసరమైన సాంకేతిక శిక్షణ సలహాలు అవగాహన అందించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. జిల్లాలో కడ్తా పేరుతో రైస్ మిల్లర్లు ధాన్యంలో కోత విధించడం పట్ల సభ్యులు అడగగా గతంలో కంటే గడచిన యాసంగిలో జిల్లా యంత్రాంగం కడ్తా విషయంలో గట్టిగానే పని చేసిందని నాణ్యమైన ధాన్యానికి వ్యవసాయ అధికారుల ధ్రువీకరణ ఉంటే అందులో నుండి కడ్తా తీయకుండా చూశామని అయితే రైస్ మిల్లుల సామర్థ్యం కంటే కూడా రెండిరతలు ధాన్యం రావడంతో కొంత ఒత్తిడి పెరిగిందని అంతేకాక వర్షాలు ఇతర కారణాల వల్ల ధాన్యం చెడిపోవడంతో 30 లక్షల బస్తాల ధాన్యం నాణ్యత లేనిది రావడంతో అధికారుల ధృవీకరించలేకపోయారు అని దానివల్ల రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో మిల్లులు ధాన్యాన్ని కూడా తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నామని, వచ్చే సీజన్లో యంత్రాంగం మరింత గట్టిగా కృషి చేసి కడ్తా లేకుండా రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నందున ఆ దిశగా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని చైర్మన్ సూచించారు. జిల్లాలో ఈ నెల 3 నుండి ఆరు రకాల వ్యాధులపై సర్వే నిర్వహించి వ్యాధిగ్రస్తులకు అవసరమైన చికిత్సలతో పాటు మందులను అందించడం జరిగిందని అధికారులు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో టిహబ్ కింద 57 రకాల పరీక్షలకు అవకాశం కల్పించామని ఇప్పటికే కొన్ని పరీక్షలు కొనసాగుతున్నాయని ప్రజలు తమ పరీక్షలకు సంబంధిత ఆరోగ్య కేంద్రాలలో నమూనాలు అందించాలని, వాటిని వాహనాల ద్వారా ప్రతిరోజు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి పరీక్షలు నిర్వహించి రిపోర్టులు తిరిగి పంపించడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రైవేటుకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవడం ద్వారా పెద్ద మొత్తంలో ఖర్చు నుండి మినహాయింపు పొందాలని కలెక్టర్ కోరారు.
ఆసుపత్రిలో పిల్లల కోసం 40 ఐసీయూ పడకలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. డెంగ్యూ చికెన్ గునియా మలేరియా తదితర వ్యాధులు ప్రబలుతున్నందున ప్రజలు లైట్‌గా తీసుకోకుండా పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని జ్వరం వస్తే కరోనా కావచ్చు లేదా మలేరియా కావచ్చని వెంటనే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకొని సత్వర చికిత్స తీసుకోవడం ద్వారా తొందరగా బయటపడడానికి అవకాశం ఉంటుందని ప్రజలకు సూచించారు.
యువరాజ్ సింగ్ నెలకొల్పిన ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా ఆస్పత్రికి 200 లేటెస్ట్ ఇక్విప్‌మెంట్ కలిగిన పడకలను విరాళంగా అందించడం ఎంతైనా అభినందించాల్సిన విషయం అని చైర్మన్ కొనియాడారు. సమావేశంలో జిల్లా అధికారులు, ఎంపీపీలు, జెడ్‌పిటిసిలు, ఇతరులు పాల్గొన్నారు.