నిజామాబాద్, ఆగష్టు 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి జగడం సుమన్, నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చక్రి దత్తాత్రితో కలిసి నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, గర్భిణీలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వరదబట్టు వేణురాజ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో శాస్త్రీయ అభివృద్ధి వైపు మొగ్గు చూపారని, ప్రపంచంలోని ఇతర దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచారని తద్వారా ఇతర దేశాలతో ఆర్థిక, శాస్త్రీయ సహకారాన్ని విస్తరించారని అన్నారు. రాజీవ్ గాంధీ హయాంలో విదేశీ విధానంలో, ఆర్థిక సరళీకరణ, సమాచార సాంకేతికతకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చాలా రంగాల్లో భారతదేశం ఈ రోజు ప్రపంచ దేశాలతో సమానంగా నిలిచిందని పేర్కొన్నారు.
రాజీవ్ గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీ, అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించారని అటువంటి పరిశ్రమలు ముఖ్యంగా కంప్యూటర్లు, విమానయాన సంస్థలు, రక్షణ, టెలికమ్యూనికేషన్ల రంగాల్లో భారతదేశం చాలా అభివృద్ధి చెందిందని, భారతీయ రైల్వే ఆధునీకరించబడిరది రాజీవ్ గాంధీ గారి హయాంలోనే అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే రాజీవ్ గాంధీ యువతకు సాధికారత కల్పించడానికి ప్రయత్నించారని, ఆ దిశగా ఓటింగ్ వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు చేశారని అన్నారు.
రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా కార్యక్రమాలను ఆధునీకరించడానికి, విస్తరించడానికి జాతీయ విద్యా విధానానికి శ్రీకారం చుట్టారని తద్వారా గ్రామీణ స్థాయి నుండి ఉన్నతవిద్య అవకాశాలను పెంపొందించారని, రాజీవ్ గాంధీ స్వల్ప వ్యవధిలోనే భారతీయ సమాజం, రాజకీయాలపై చెరగని ముద్ర వేశారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శివ, మధు, రాజు, సాయి, గణేష్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.