నిజామాబాద్, ఆగష్టు 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఒకటి నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఇంటింటికి తిరిగి నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ టాబ్లెట్స్ తప్పనిసరిగా వేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నేషనల్ డి వార్మింగ్ డే కార్యక్రమాన్ని ఈనెల 25 నుండి 31 వరకు నిర్వహిస్తున్నందున కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించడంపై పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 5 లక్షల 4 వేలకు పైగా విద్యార్థులు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున వైద్య ఆరోగ్య శాఖతో పాటు జిల్లా విద్యాశాఖ సంక్షేమ శాఖలు ఐసిడిఎస్ మైనార్టీ తదితర శాఖల ఆధ్వర్యంలోని ఒకటి నుండి 15 సంవత్సరాలు పిల్లలందరికీ కూడా టాబ్లెట్స్ అందేవిధంగా వారు వేసుకునే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించి కార్యక్రమం విజయవంతం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కడుపులో నులి పురుగులు ఉండడంవల్ల పిల్లల్లో మానసిక ఆరోగ్య ఎదుగుదల సరిగా ఉండదని వయస్సుకు తగిన బరువు కూడా ఉండదని మరెన్నో సమస్యలతో పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటారని కావున తప్పనిసరిగా ఈ వయసు పిల్లల్లో ఒక్కరు కూడా మిస్ కాకుండా టాబ్లెట్స్ వేయించాలన్నారు.
గతంలో వారు చదువుకునే పాఠశాలల్లోనే టాబ్లెట్స్ ఇచ్చేవారని కోవిడ్ జాగ్రత్తలను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఇంటింటికి తిరిగి వేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయటానికి విద్యాశాఖ తమ అధీనంలోని ఉపాధ్యాయులు సహకరించి వారి పరిధిలోని అందరూ పిల్లలకు టాబ్లెట్స్ వేయించడానికి పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు.
ఇంటర్మీడియట్ విద్యాశాఖ ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లా పంచాయతీ శాఖ అధికారులు గ్రామాలలోని ప్రతి పిల్లవానికి టాబ్లెట్స్ అందే విధంగా పూర్తి సహకారం అందించాలన్నారు. ఎస్సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ, ఐసిడిఎస్ తదితర శాఖల అధికారులు తమ పరిధిలోని పిల్లలందరికీ కూడా అల్బెండజోల్ టాబ్లెట్స్ అందేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి అన్ని విధాల సహకారం అందించాలని ఎక్కడ కూడా తేడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి శాఖ అధికారులు, సిబ్బంది పైన ఉన్నదని స్పష్టం చేశారు.
సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రా మిశ్రా, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, అడిషనల్ డిసిపి ఉషా విశ్వనాథ్, డిఎమ్ హెచ్‌ఓ బాల నరేంద్ర డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌వో సుదర్శనం, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.