ఆక్సిజన్‌ అందకుండా ఎవరు చనిపోవద్దని ఆక్సిజన్‌ ప్లాంట్‌

నిజామాబాద్‌, ఆగష్టు 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండవ విడత కరోనా వల్ల ఎంతోమంది ఆత్మీయులు, బంధువులు చనిపోవడం తనను ఎంతగానో కలచివేసిందని ఆ బాధలో పుట్టిందే మోర్తాడ్‌లో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఆలోచన అని రాష్ట్ర రోడ్లు – భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఇకముందు ఎవ్వరు కూడా ఆక్సిజన్‌ కొరతతో చనిపోకూడదనే ఉద్దేశ్యంతో బాల్కొండ నియోజకవర్గంలోని మిత్రులతో కలిసి మోర్తాడ్‌లో ఆక్సిజన్‌ ప్లాంట్‌, బాట్లింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

బుధవారం మోర్తాడ్‌ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో తాను తన మిత్రుల ఆర్థిక సహాయంతో ఏర్పాటుచేసిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ బాట్లింగ్‌ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కోవిడ్‌ సందర్భంగా ఆక్సిజన్‌ అందక బెడ్స్‌ లేక ఎంతోమంది మిత్రులను, ఆత్మీయులను కోల్పోవడం జరిగిందని ముందు ముందు ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఏం చేయాలని మేధోమధనం చేసిన తర్వాత ప్రభుత్వం ద్వారానే కాకుండా తన వంతుగా కూడా ఒక కార్యక్రమం చేపట్టాలని ఆలోచించి తన మిత్రులతో మాట్లాడి నియోజకవర్గంలోని 10 పీహెచ్‌సిలు, 2 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో అత్యవసర సేవలు అందించడానికి అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

అందుకు తన మిత్రుల నుండి కూడా పూర్తిస్థాయిలో సహకారం, ఆర్థిక సహాయం అందిందని తద్వారా నియోజకవర్గంలోని ఆరోగ్య కేంద్రాలలోని 102 బెడ్‌లను ఆక్సిజన్‌ బెడ్‌లుగా మార్చాలని అనుకున్నట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా తన మిత్రులు కోటి రూపాయల పైగా సహాయం అందించారని ఆక్సిజన్‌ ప్లాంట్‌, బాట్లింగ్‌ యూనిట్‌ మరో 54 లక్షలు తాను, మిత్రులు కలిసి వీటిని ఏర్పాటు చేయుటకు జిల్లా యంత్రాంగానికి నిధులను అందించి తగు చర్యలకై కోరడం జరిగిందన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆసుపత్రులకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అందించారని, తాను తన మిత్రులతో కలిసి నియోజకవర్గంలో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ స్థాయిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడం తనకెంతో సంతోషంగా ఉందని ఇందుకు సహకరించిన తన మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. వీటితో పాటు మోర్తాడ్‌ బాల్కొండలో ఐదు చొప్పున వేల్పూర్‌లో 4 ఐసియు బెడ్స్‌ కూడా ఏర్పాటు చేశామని, మోర్తాడ్‌లో ఆర్‌ఓ ప్లాంట్‌ కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు.

వీటితో పాటు ఆర్మూర్‌లో 5, బోధన్‌లో 10 ఐసియు బెడ్స్‌ ఏర్పాటు చేశామన్నారు. నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎస్‌టిపి యూనిట్‌ కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు వాతావరణం బాగా కనిపించాలనే ఉద్దేశంతో కనీస సదుపాయాలు చిన్నచిన్న మరమ్మతులు రిసెప్షన్‌ భవనాలకు కలరింగ్‌ తదితర పనులు కూడా చేయించాలని తెలిపామన్నారు. రాష్ట్రంలో మొట్ట మొదటి సారి బాల్కొండ నియోజకవర్గంలో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు.

ఆరోగ్యం బాగుంటే ఏమైనా సాధించొచ్చు – కలెక్టర్‌

ఆక్సిజన్‌ ప్లాంట్‌ బాటిలింగ్‌ యూనిట్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఆరోగ్యం బాగుంటే ఏమైనా సాధించవచ్చన్నారు. తెలంగాణలోనే మొట్టమొదటిసారి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఉండటం అదేవిధంగా బాట్లింగ్‌ యూనిట్‌ అనేది ఇప్పటివరకు ఏ హాస్పిటల్లో మనకు లేదు అన్నారు.

అది సిహెచ్‌సి మోర్తాడ్‌లో ప్రారంభించుకోవడం సంతోషదాయకమన్నారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో నిజామాబాద్‌లో ఆక్సిజన్‌ కోసం బెడ్స్‌ కోసం ఎంతో ఇబ్బంది పడ్డాం రోజు 14 వందల నుండి 15 వందల సిలిండర్లు వాడేవాళ్లం వాటిని బయటి నుండి తెచ్చుకునే వాళ్ళం లిక్విడ్‌ ట్యాంకర్ల ద్వారా తెచ్చుకొని అక్కడి నుండి నింపుకునే వాళ్ళం అన్నారు. మొదటిసారి మనమే తయారు చేసి సప్లై చేసుకునే స్థాయికి వచ్చామన్నారు.

ఆక్సిజన్‌ అవసరం ఉంటే ఇక్కడి తయారు చేసి సప్లై చేయొచ్చని, మంత్రి చొరవతో మిత్రుల ద్వారా, సొంతంగా యూనిట్‌ ఏర్పాటు సిఎస్‌ఆర్‌ ద్వారా తీసుకురావడం జరిగిందన్నారు. ఇంతకు ముందు కోటి రూపాయలు ఇవ్వడం జరిగిందని అన్నారు. బోధన్‌, ఆర్మూర్‌ ఏరియా హాస్పిటల్‌లో ఆక్సిజన్‌ బెడ్స్‌ ఏర్పాటు పైపులైన్‌ ఏర్పాటు కావలసిన ఏర్పాట్లు పేషెంట్లకు బెటర్‌ ఫెసిలిటీ ఇచ్చే విధంగా మానిటర్‌ మీటర్స్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

నిజామాబాద్‌, ఆర్మూర్‌లో ఉన్న సౌకర్యాలు మోర్తాడ్‌లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వేల్పూర్‌లో కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోవీడ్‌ థర్డ్‌ వేవ్‌ రావద్దని కోరుకుందాం వస్తే కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సిహెచ్‌సి, పిహెచ్‌సి లెవెల్‌లో హ్యాండిల్‌ చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ బాల నరేంద్ర, జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌, ఆర్డిఓ శ్రీనివాస్‌, ఎంపీపీ అధ్యక్షులు శివలింగ శ్రీనివాస్‌, జెడ్‌పిటిసి రవి, గ్రామ సర్పంచ్‌, తహసిల్దార్‌ శ్రీధర్‌, డిప్యూటీ డిఎం హెచ్‌ఓ రమేష్‌, మెడికల్‌ ఆఫీసర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »