గాంధారి, సెప్టెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మానవత్వం మంటకలిసింది. అప్పుడే జన్మనిచ్చిన ఓ పండంటి మగశిశువుని ముళ్లపొదల్లో విదిలేసి వెళ్ళింది ఆ తల్లి. కారణం ఆమె అవివాహిత మైనర్ బాలిక కావడమే అని గ్రామస్తుల అనుమానం. వివరాల్లోకి వెళితే గాంధారి మండలంలోని బిర్మల్ తండా గ్రామ శివారులో బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు బావి వద్ద గల ముళ్లపొదలలో అప్పుడే పుట్టిన మగ శిశువుని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు, ఐసిడిఎస్ అధికారులకు, అంగన్వాడీ కార్యకర్తకు సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్‌ఐ శంకర్, అధికారులు శిశువుని స్వాధీనం చేసుకొని మెరుగైన చికిత్స కొరకు కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ శిశువుకి చికిత్స చేసిన తర్వాత ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రస్తుతం పరిశీలనలో ఉంచామని వైద్యులు, ఐసిడిఎస్ అధికారులు తెలిపారు.
బిర్మల్ తండా గ్రామశివారులో బావి వద్ద మగశిశువును గుర్తించిన దగ్గరలోనే మరో బావిలో బుధవారం తెల్లవారుజామున అదే తండాకు చెందిన ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి డిఎస్పి శశాంక్ రెడ్డి, స్థానిక ఎస్‌ఐ శంకర్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బావిలోనుండి బయటకు తీసి పంచనామా నిర్వహించారు.
పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. రెండు వేర్వేరు సంఘటనలు అయినా ఆత్మహత్య చేసుకున్న మైనర్ బాలికకు, ముళ్లపొదలతో లభ్యం అయిన శిశువుకు ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శంకర్ తెలిపారు. బిర్మల్ తండా గ్రామస్తులు తెలిపిన ప్రకారం తండాకు చెందిన ఓ మైనర్ బాలిక అవివాహిత అయి కూడా గర్భిణీగా ఉందన్నారు. ఆ అవివాహితకు రాత్రి నొప్పులు రావడంతో మగ శిశువుని జన్మనిచ్చి ఉంటుందని, తర్వాత ఏమి చేయాలో తెలియక బావి వద్ద ముళ్లపొదల్లో విడిచి వెళ్లి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆ తర్వాత అవమానంతో దగ్గరలోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుకుంటున్నారు. ఏదిఏమైనా తొందరపడిన ఓ అభాగ్యురాలు పండంటి శిశువుని అనాథను చేసి తాను తనువు తాలించడంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.