గిరిజనుల భూములు లాక్కోవడమేనా హరితహారం…?

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్‌ జిల్లా, బీంగల్‌ మండలంలోని గంగరాయి, కారేపల్లి తండాలను సందర్శించింది. ఈ సందర్భంగా ఆదివారం కోటగల్లీలో నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఫ్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ మాట్లాడుతూ పోడు భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులను, గిరిజనేతరులను భూమి నుండి భేదకల్‌ చేయడానికి ప్రభుత్వం అటవీ శాఖ అధికారులతో వేదింపులకు గురిచేస్తున్నదని అన్నారు.

గంగారాయి తండాలో మాలవత్‌ జ్యోతి అటవీ బీట్‌ అధికారి సునీత వేధింపుల వలన ఈనెల 2న పంట చేనుకు తెచ్చిన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందని, తరువాత ఆమె బంధువులు బీంగల్‌లోని బాలాజీ దవాఖానలో చేర్చి వైద్యం చేయించడం వలన ఆమె ప్రాణాలతో బయట పడిరదన్నారు. ఈ సంఘటనను పౌర హక్కుల సంఘం తీవ్రంగా పరిగణించిందని, దీంతో జ్యోతి ఇంటి వద్దకు వెళ్లి ఆమెను పరామర్శించినట్టు తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులను కలిసి వివరాలు సేకరించామని, జ్యోతి ఆత్మయత్నానికి కారణమైన వివరాలు అడిగి తెలుసుకున్నామన్నారు.

జ్యోతి భర్త దేవేందర్‌ గల్ఫ్‌దేశాలకు జీవనోపాధి కొరకు వెళ్లాడని, దేవేందర్‌ తండ్రి తావుర్యాకు నల్గురు కొడుకులు, తావుర్యా గత 30 సంవత్సరాలుగా సాగుచేసిన అడవి భూమిని అతని కొడుకులకు ఇచ్చాడని, జ్యోతి భర్త దేవేందర్‌ 3 ఎకరాలు పోడు వ్యవసాయంతో ఇద్దరు అమ్మాయిల్ని పెంచి పోషించి, పెండ్లిలు చేయడం సాధ్యం కాదని ఉపాధి కోసమే గల్ఫ్‌దేశాలు వెళ్లి అక్కడ పని లేక రెండు సార్లు తిరిగి దేశానికి వచ్చి మళ్లీ గల్ఫ్‌ వెళ్ళాడని పేర్కొన్నారు. ఉన్న పోడు వ్యవసాయం జ్యోతి సాగు చేస్తున్నదని, కరోనా కారణంగా కొద్ది రోజులు ఎవరిని బయటకు రాకుండా కట్టడి చేయడం వలన ఖరీఫ్‌ 2021 లో వెంటనే పంట వేయలేదన్నారు.

వర్షాలు మొదలైనందున తిరిగి పంట వేయడానికి దుక్కి దున్నే సమయంలో ఫారెస్ట్‌ బీట్‌ అధికారి సునీత అడ్డుకుందని, గత రెండు నెలలుగా 10 సార్లు భూమి వద్దకు వచ్చి జ్యోతి పంట వేయకుండా అడ్డుకుందని, రెండు నెలలుగా బీంగల్‌ పోలీస్‌ స్టేషన్‌కు జ్యోతిని 4 సార్లు పిలిచారని, పోలీసులు సునీత వస్తుందని, కాబట్టి ఉండమని చెప్పి సాయంత్రం వరకు స్టేషన్‌లో ఉంచుకుని పంపించారని జ్యోతి తమతో చెప్పి ఏడ్చిందన్నారు. ఈనెల 2న బీట్‌ అధికారి సునీత బీహార్‌ కూలీలను తీసుక వచ్చి హరిత హారం చెట్లు నాటడానికి చెట్లు తీసుకువచ్చి వీరి పంట చేనులో వేశారని, చెట్లు నాటడం కొరకు కూలీలతో వీరి భూమిలో గుంతలు తవ్వుతుండగా జ్యోతి, ఆమె ఇద్దరు ఆడ పిల్లలు, మామ తావూర్య, అత్త దర్మీ కూలీలను అడ్డుకున్నారన్నారు.

సునీత, ఇంకా కొందరు మగ వారు కూలీలతో గుంతలు త్రవ్వుతుండగా సునీతను బ్రతిమిలాడారని, సునీత (లంబాడా) యస్‌.టీ అయి ఉండి కనికరం చూపలేదని, ఆడ పిల్లలు సునీత కాళ్ళు పట్టుకుంటే ఆమె వారిని కాళ్ళతో తన్నిందని, ఫారెస్ట్‌ అధికారుల కోసం పిల్లల్ని కన్నవా అని ధర్మిని సునీత అన్నదని ధర్మీ నిజనిర్ధారణ కమిటీ ముందు చెప్పి ఆవేదన చెందిందన్నారు.

ఇక చేసేది లేక మామ తావుర్య అడవిలో ఉరేసు కోవడానికి గుట్ట పైకి ఎక్కాడని, ధర్మి అతన్ని వెతకడానికి వెళ్ళిందని, జ్యోతి భర్తకు ఫోన్‌ చేసి జరుగుతున్న విషయం చెప్పి సునీత ఫోన్‌ నెంబర్‌ అతనికి ఇచ్చిందన్నారు. దీంతో అతను ఆమెకు ఫోన్‌ చేసి తమకు బ్రతకడానికి ఉన్న ఈ కాస్తా భూమి పోతే ఆడ పిల్లల పెండ్లిలు చేయడం సాధ్యం కాదని, వారి పెండ్లిల తరువాత నేను తమకు భూమిని స్వాధీనం చేస్తానని చెప్పాడన్నారు. అయిన కానీ సునీత కనికరించలేదని, చివరికి జ్యోతి భూమి పోతుందని, గత సంవత్సరం అదే భూమిలో పత్తి పంటకు కొట్టిన పురుగుల మందు మిగిలింది అక్కడే చేనులో ఉన్నది తీసుకొని త్రాగి ఆత్మహత్య ప్రయత్నం చేసిందన్నారు.

సునీత గాని, వారి సిబ్బంది కానీ జ్యోతిని దవాఖానకు తీసుక వెళ్లే ప్రయత్నం చేయలేదని, జ్యోతి బంధువులు ఆమెను బీంగల్‌ బాలాజీ దవాఖానకు వెంటనే తీసుకురావడం వలన ఆమె ప్రాణాలు దక్కాయని, రెండు రోజులు దవాఖానలో ఉంటే అటవీ అధికారులు సందర్శించ లేదని, ఆర్థిక సహాయం చేయలేదన్నారు. రెవెన్యూ అధికారులు ఈ సంఘటనపై విచారణ చేయలేదని, జ్యోతి, వారి కుటుంబ సభ్యులు సాగుచేస్తున్న పోడు భూములను నిజనిర్ధారణ బృందం సందర్శించి పరిశీలించిందన్నారు. జ్యోతి భర్త దేవేందర్‌, ఇతర కుటుంబ సభ్యులు ఇప్పటికే లక్షలు ఖర్చు చేసి భూమిని వరి సాగు కోసం చదును చేశారని, కానీ ఫారెస్ట్‌ అధికారులు వాటిని అడవి భూములు అని అంటూ చెట్లు నాటే కార్యక్రమాన్ని చేయడానికి పూనుకొని మొక్కలు డంప్‌ చేశారన్నారు.

దీని వలన జ్యోతి, ఆమె కుటుంబ సభ్యులకు మరింత ఆవేదన, భయం వ్యక్తం కావడానికి కారణం అయ్యిందని, కారేపల్లి తండాను కూడా నిజ నిర్ధారణ బృందం సందర్శించి గిరిజనులతో మాట్లాడి వివరాలు సేకరించిందని, సర్వే నంబర్‌ 44 లో 3600 ఎకరాలు ప్రభుత్వ భూమి నుండి 1200 ఎకరాలు గిరిజనులు సాగు చేస్తున్నారని, కొందరికి రెవెన్యూ అధికారులు పట్టాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు.

వీరు వీటితో పాటుగా ఫారెస్ట్‌ భూములను సాగు చేసుకొని వారి తాత ముత్తాతల నుండి పోడు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారని, ఇక్కడ కూడా ఫారెస్ట్‌ అధికారులు గిరిజనులను భూముల్లోకి రానివ్వడం లేదన్నారు. రెవెన్యూ పట్టా భూములను కూడా ఫారెస్ట్‌ భూములని ఫారెస్ట్‌ అధికారులు వేధిస్తున్నారని, భూముల్లో బోరు బావులు త్రవ్వకుండ ఫారెస్ట్‌ అధికారులు వేధిస్తున్నారని, నిజ నిర్ధారణ బృందం ముందు వారు తెలిపారు.

ఫారెస్ట్‌ భూములకు ఫారెస్ట్‌ హక్కుల చట్టం 2006 ప్రకారం గిరిజనులకు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం బలవంతంగా గిరిజనులను భూముల నుండి తరిమి వేసే ప్రయత్నం చేస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. గంగారాయి తండాలో గిరిజనులు వందల ఎకరాలు వారి తాత ముత్తాతలు నుండి పోడు వ్యవసాయం చేసుకుంటున్నారని, ఈ మధ్య కాలంలో వరి పంట సాగు చేస్తున్నారని, ప్రభుత్వం హరిత హారం పేరుతో తెలంగాణ జిల్లాల్లోని ఆదివాసులు, గిరిజనులు సాగుచేసుకుంటున్న ఫారెస్ట్‌ భూములను బలవంతంగా వారి నుండి స్వాధీనం చేసుకుని గిరిజనుల, అది ఆదివాసుల జీవించే హక్కును హరించి వేస్తుందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ అన్నారు.

నిజ నిర్ధారణ బృందంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ రావు, రాష్ట్ర నాయకలు వి. సంగం, జిల్లా అధ్యక్షుడు మువ్వా నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గొట్‌ రవీందర్‌, జిల్లా నాయకులు కొంగర శ్రీనివాస్‌ రావు, కేతావత్‌ ప్రేమ్‌ సింగ్‌, కేతావత్‌ భీక్‌ సింగ్‌, జెలేందర్‌, న్యాయవాది కే. శ్రీనివాస్‌, ప్రవీణ్‌, కృష్ణంరాజు, పీ.డీ.ఎస్‌.యు. జిల్లా ఉపాధ్యక్షుడు నరేందర్‌ పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »