అచ్చులన్నీ అచ్చుపోసి..
హల్లులు హరివిల్లులా..
పదాలపారాణి అద్ది..
ఆ శర్వాణి పాదాలకు
అక్షరనీరాజనం అర్పించువాడు గురువు.
తల్లిదండ్రి జన్మనిచ్చి..
తప్పటడుగులు వేయిస్తే..
మనలో జ్ఞానజ్యోతిని
వెలిగించి తప్పుడడుగులు
పడకుండా కాపాడే అదృశ్యశక్తి
గురువు..
మన అజ్ఞానాంధకారాన్ని తొలిగించే ఆపద్భాంధవుడు గురువు…
ఆలోచన పెంచేది గురువే..
వివేచన కలిగించేది గురువే..
మన హృదిలో విజ్ఞానసుమాలు పూయించి
జీవితాన్ని ఓ నందనవనంలా
మార్చేది గురువే…
దేశానికి రాజైనా, చక్రవర్తి అయినా మోకరిల్లేది గురువుకే..
సంస్కారబీజాలను
అంకురార్పణ చేస్తూ
కాలజ్ఞానాన్ని బోధించిన వీరబ్రహ్మంలాంటి వాడు గురువు..
జీవన రణక్షేత్రంలో
వ్యక్తిత్వవికాస గీతను బోధించే కృష్ణుడంతడి వాడు గురువు..
జగతిని సన్మార్గంలో నడిపే
జగద్రక్షకుని లాంటి వాడు
గురువంటే…
అలాంటి గురువులకు పాదాభివందనం
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో…
రచన : కొబ్బాజి రంజిత్