నిజామాబాద్, సెప్టెంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నుండి నియోజకవర్గానికి బయలుదేరుతూ మార్గ మధ్యలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్సారెస్పీ ఎస్.ఈ శ్రీనివాస్, సీ.ఈ సుధాకర్‌లతో వర్షాలపై రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. పలు అంశాలపై జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
రోడ్లపై నీరు పారుతున్నట్లయితే అక్కడే గ్రామ వి.ఆర్.ఏ ని పర్యవేక్షించేలా చూడాలని, విద్యుత్ సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. రెవెన్యూ, పంచాయితీ రాజ్, ఆర్అండ్బి డిపార్టుమెంట్లను సమన్వయం చేసుకోవాలని, ఎస్సారెస్పీ నీటి ఇఫ్లో ఔట్ ఫ్లో వివరాలు ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలన్నారు. మహారాష్ట్ర నుండి, నిజాంసాగర్ కూడా నిండటంతో మంజీరాలో కూడా ప్రవాహం పెరిగి ఎస్సారెస్పీకి ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉందని, అలాగే ప్రాజెక్ట్ నుండి దిగువకు భారీగా నీటి విడుదల జరుగుతున్నందున దిగువ గ్రామాలను అప్రమత్తంగా ఉంచాలన్నారు. అవసరమైన లోతట్టు ప్రాంతాలు వారిని పునరావసాలకు తరలించాలని మంత్రి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని ఆదేశించారు.