జగిత్యాల, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాషిగామ వద్ద ఈనెల 9న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించి, గాయపడ్డ వారికి ప్రభుత్వం ద్వారా మెరుగైన వైద్యము అందించాలని సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోతు రవిని సిసిఆర్ సంస్థ ప్రతినిధులు కోరారు.
స్థానిక ఐఎంఏ భవన్‌లో జరిగిన ప్రజావాణిలో కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ జగిత్యాల జిల్లా కన్వీనర్ అయిల్నేని శ్రీనివాస్ రావు సూచన మేరకు జిల్లా ప్రతినిధులు చుక్క గంగారెడ్డి, ఏనుగు సాయి రాజ్, పాలెపు రాజశేఖర్, ఏ.గంగాధర్, బి.రాజేందర్ తదితరులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అధికారుల నిర్లక్ష్యమే పాశిగామ ప్రమాదానికి కారణమన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూస్తూ బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను సిసిఆర్ సంస్థ ప్రతినిధులు కోరారు.
జాతీయ రహదారిపై ఏర్పడ్డ గుంతల వల్లనే పాషిగామ దుర్ఘటన జరిగిందని వారు కలెక్టర్‌కు సూచించారు. రోడ్లు – భవనాల శాఖ, జాతీయ రహదారి అథారిటీ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణం అన్నారు. పాషిగామ రోడ్డు ప్రమాదంలో ఒకే ఇంటికి చెందిన కుటుంబ యజమాని కోడిపుంజుల తిరుపతితో సహా, ఇద్దరు పిల్లలు మృత్యువాత పడటం, మరో ఇద్దరు తీవ్రగాయాల పాలు కావడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. వెంటనే బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో గానీ, రాష్ట్రంలో గానీ ఇలాంటి దుర్ఘటనలు, ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌కు వారు విజ్ఞప్తి చేశారు.