కామారెడ్డి, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో తండ్రికి కూతురే కొడుకులా అంత్యక్రియలు నిర్వహించిన సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గడ్డం నర్సింలు (40) ఆదివారం మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింలు మృతి చెందడంతో ఆయన పెద్ద కూతురు నందిని అంత్యక్రియలు నిర్వహించారు.
నిరుపేద కుటుంబానికి చెందిన నర్సింలు కుటుంబం పూటగడవని దయనీయ స్థితి, ఎటువంటి వ్యవసాయ భూమి కూడా లేకపోవడం రెక్కాడితే గానీ కడుపు నిండని కడు పేదరికం, దానికి తోడు కుటుంబ పెద్ద దిక్కుగా ఉన్న నర్సింలు మృతి చెందడం, ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా మారే పరిస్థితిలా మారిపోయింది. కొడుకులు లేకపోవడంతో కన్న కూతురే కొడుకుగా మారి అంత్యక్రియలు నిర్వహించడం అందరినీ కలచివేసింది. అసలే పేదరికం, వీరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు గ్రామస్తులు కోరారు.