నిజామాబాద్, సెప్టెంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో చేసుకుందామని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి కోరారు. 19 వ తేదీన జరుపుకోబోయే వినాయక నిమజ్జనం సందర్భంగా గణేష్ శోభాయాత్ర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, సిపి కార్తికేయతో కలిసి రథం బయలుదేరే దుబ్బ నుండి ప్రారంభించి వినాయకుల బావి వరకు పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ మండపాల నుండి నిమజ్జనం రోజు సిస్టమేటిక్‌గా అధికారులు ముఖ్యంగా పోలీస్ అధికారుల సూచనలు పాటిస్తూ ఆనందమయమైన వాతావరణంలో గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని చేసుకునే విధంగా ముందుకు సాగుదామన్నారు. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, లైటింగ్ మిగతా అంశాలు రేపు ఎల్లుండి ఉదయం వరకు పూర్తి చేయాలని ఆదేశించారు.
వినాయక నగర్‌లోని గణేష్ భావి దగ్గర నిమజ్జనానికి 3 నుండి 4 ఫీట్స్ ఉన్న వినాయకులను మాత్రమే తీసుకురావాలని, మిగతా వాటికి చాలాచోట్ల నిమజ్జనం పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గణేష్ విగ్రహం సైజును బట్టి ఎక్కడికి వెళ్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులతో సంప్రదించి ఆ విధంగా ముందుకు వెళ్లాలని జిల్లాలోని అన్ని ప్రాంతాలలో ఉన్న అన్నీ నిమజ్జన పాయింట్లలో సుమారుగా చిన్న చిన్న ట్యాంకులు 220 వరకు గణేష్ నిమజ్జనం పాయింట్స్ ఉన్నాయని అన్ని ప్రాంతాలకు అక్కడి లోకల్ బాడీ గ్రామపంచాయతీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఎక్కడికక్కడ స్థానిక అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ ప్రతి ఒక్కరు గణేష్ నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.
సిపి కార్తికేయ మాట్లాడుతూ ఈసారి రోడ్డు కండిషన్ చక్కగా బ్రహ్మాండంగా ఉన్నదని, వినాయక బావిలో కూడా అన్ని బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వివరంగా కానిస్టేబుల్ నుండి హోంగార్డు వరకు అందరూ 100 శాతం ప్రజలతో కలిసి పని చేస్తున్నారన్నారు. నిజామాబాద్ ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా ఈ పండుగను కచ్చితంగా గత సంవత్సరం లాగానే ఈయేడు కూడా విజయవంతం చేయాలని ఎవరైనా ప్రాబ్లమ్స్ సృష్టించాలనుకొంటే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.
అంతకు ముందు దుబ్బ చౌరస్తా నుండి వినాయక టెంపుల్ దగ్గర రథం పరిశీలన రైల్వే గేట్ శ్రద్ధానంద్ గంజ్, గాంధీ చౌక్, బోధన్ బస్ స్టాండ్, ఖిల్లా రోడ్డు, బర్కత్ పుర, గురుద్వార్, బడా బజార్, గోల్ హనుమాన్, వినాయక్ నగర్ పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ /మున్సిపల్ కమిషనర్ చిత్ర మిశ్రా, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఏసీపీ శ్రీనివాస్, గణేష్ మండలి అధ్యక్షులు బంటు గణేష్, ఆర్‌డిఓ రవి, ఆర్‌అండ్‌బి ఇంజనీర్లు విద్యుత్ ఇంజనీర్లు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.