ఆర్మూర్, సెప్టెంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరగాలని ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ వినీత పవన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్, మామిడిపల్లి, గుండ్ల చెరువులను అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే గణేష్ నిమజ్జనానికి తరలివెళ్లే శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించి రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చివేయించినట్టు పేర్కొన్నారు.
అదేవిధంగా నిమజ్జనం జరిగే చెరువులు, బావుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయించామని, పెద్ద విగ్రహాలు నిమజ్జనం కోసం క్రేన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. వినాయక మండలిల నిర్వాహకులు అధికారుల సూచనలు సలహాలు పాటించాలని, అధికారులకు పోలీసులకు పూర్తిగా సహకరించాలని తెలిపారు.