నిజామాబాద్, సెప్టెంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలందరు ఆనందంగా శోభయాత్రలో పాల్గొనడానికి పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని నిజామాబాద్ పోలీసు కమీషనర్ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఏలాంటి రూమర్స్ (పుకార్ల) ను నమ్మరాదని, అవసరం అనుకుంటే దగ్గరలోని సిబ్బందికి గాని పోలీస్ స్టేషన్‌కు గాని సమాచారం అందించాలన్నారు.
సామాజిక మాధ్యమంల్లో వచ్చే వదంతులు నమ్మవద్దని, శోభయాత్ర జరిగే ప్రాంతాలలో యాత్ర జరిగేటప్పుడు ట్రాఫిక్ డైవెర్షన్ ఉంటాయి కాబట్టి ప్రజలు దానికి అనుకూలంగా సిద్ధం కావాలన్నారు. హైదరాబాద్ నుండి బోధన్- వయా మాధవ్ నగర్ బైపాస్ రోడ్డు- కంఠేశ్వర్ అర్సావల్లి -బోధన్ వెళ్ళాలని, బోధన్ నుండి హైదరాబాద్- బోధన్ అర్సావల్లి బైపాస్ కంఠేశ్వర్ మాధవ్ నగర్ వెళ్లాలన్నారు.
బాసర బ్రిడ్జిపై నిమజ్జనం సందర్బంగా ట్రాఫిక్ డైవెర్షన్ ఉంటుంది కాబట్టి, నిజామాబాద్ పైపు నుండి వెళ్ళే వాహనములు జాన్కంపేట్ – సాటాపూర్ గేట్ కందకుర్తి ధర్మాబాద్ బిద్రెల్లి, భైంసా, గణేష్ నిమజ్జనం తర్వాత వాహనాలు బిద్రెల్లి, ధర్మాబాద్ కందకుర్తి ద్వారా (లేదా) భైంసా, నిర్మల్ ఆర్మూర్ ద్వారా నిజామాబాద్ రావాల్సి ఉంటుందన్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు 19వ తేదీ ఆదివారం సాయంత్రం నుండి 20వ తేదీ సాయంత్రం 5 వరకు ఉంటాయన్నారు. ఆర్.టి.సి బస్సులు హైదరాబాద్ వెళ్ళాల్సినవి బస్టాండ్ – ఎన్.టి.ఆర్ విగ్రహం రైల్వే కమాన్ కంఠేశ్వర్ – బైపాస్ రోడ్డు మీదుగా – మాదవ గనర్ వైపునకు వెళ్లాలని, గణపతి విగ్రహాల్ని తీసికొని వెళ్ళి వాహానాలను చెకప్ చేయించుకోవాలన్నారు. మద్యం త్రాగి వాహనాలను నడుపరాదని, మద్యం త్రాగి గణేష్ వాహానాలు నడిపే వారిపై అల్కామీటర్ పరీక్షలు జరుపబడుతాయని, వారు మద్యం త్రాగివున్నట్లయితే వారిపై క్రిమినల్ చర్యలు తీసికొనబడుతాయన్నారు.
డి.జేలకు ఎట్టి పరిస్థితిలో అనుమతి లేదని, టపాకాయలు కాల్చరాదని, ప్రజలు పోలీసులకు సహకరించి శోభాయాత్ర విజయవంతంగా పూర్తి అయేటట్లు చూడాలన్నారు. మహిళలు, విలువైన వస్తువులు ధరించకుండా ఉంటే మేలని, ఊరేగింపులో చిన్న పిల్లలు తప్పిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసికోవాలన్నారు. నగరం మొత్తం సి.సి టివి పరిధిలోకి తీసికొనిరావడం జరిగిందని, నిమజ్జనం జరిగే ప్రాంతంలో (గోదావరి నది), ఇతర చెరువుల వద్ద చిన్న పిల్లలు అనుమతించబడరన్నారు.