కామారెడ్డి, సెప్టెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను అడుగడుగునా ప్రశ్నిస్తాం.. ముఖ్యమంత్రి చేసిన ప్రజా ద్రోహాన్ని ప్రశ్నిస్తాం నీకు దమ్ముంటే నా పై రాజద్రోహం కేసు పెట్టు కేసీఆర్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సవాల్ విసిరారు. ప్రజా సమస్యలపై చైతన్యం చేస్తూ, ప్రజల స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రజాసంగ్రామ యాత్ర పేరిట చేపట్టిన పాదయాత్రలో బాగంగా సోమవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయిలో ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు.
నిన్నొకడు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడ్తాం.. రెండేళ్ల జైలు శిక్ష వేస్తాం అంటూ మాట్లాడాడు.. ప్రజల సమస్యలపై.. ఎన్నికలకు ముందు కేసీఆర్ ఇచ్చిన హామీలపై బరాబర్ ప్రశ్నిస్తాం.. మీకు దమ్ముంటే నాపై రాజద్రోహం కేస్ పెట్టు కేసీఆర్ అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించని కేసీఆర్‌పై దేశద్రోహం.. రాజద్రోహం కేసు పెట్టాలన్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌తో ఉంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేసి ప్రజా ద్రోహ ప్రభుత్వాన్ని కూల్చండని పిలుపునిచ్చారు.
పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్‌లు ఇస్తనన్నవు.. నిరుద్యోగ భృతి అన్నవు.. దళితుడు ముఖ్యమంత్రి అన్నవు.. మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం.. పోడు భూములకు పట్టాలు అన్నవు ఇలా ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడ్తావా.. ముఖ్యమంత్రి.. అంటూ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. బార్లకు ఉచితంగా రెన్యువల్ చేస్తున్నవు.. రైతులను పట్టించుకుంటలేవు.. రైతులకు రైతు బంధు మాత్రమే ఇచ్చి సబ్సీడీలు ఎత్తివేశావు.. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి, లింగంపేట్ మండలాల్లో మక్కజొన్న ఎక్కువగా పండిస్తారు రైతులు.. వారికి గిట్టుబాటు ధర రావడం లేదని చెబుతున్నారు.. రాష్ట్రాన్ని ఏలుతున్న నీకు బాధ్యత లేదా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.
రైతుల మక్కలు కొనుమంటే.. కేంద్రం వైపు చూపిస్తాడు.. వరి అంటే ఉరే అని రైతులను భయ బ్రాంతులకు గురిచేస్తున్నాడు.. ఓసారి సన్నవడ్లు అంటడు.. మరోసారి దొడ్డు వడ్లు వేయాలంటాడు.. భూసార పరీక్షలు చేసేందుకు కేంద్రం రూ.126 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం భూసార కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల్లో నష్టబోయే రైతులకు ఫసల్ భీమా లేదు.. కోవిడ్ సమయంలో ఆయుష్మాన్ భారత్ లేదు.. కేంద్రం అమలు చేసే పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తే మోడీకి పేరొస్తుందని కేసీఆర్ కుట్ర పూరితంగా ఆలోచనలు చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాడన్నారు.
ఇవాళ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. కోవిడ్ కాలంలో పోలీసులు, శానిటరీ, జర్నలిస్టులు, ఆశా వర్కర్లు, డాక్టర్లు, ఏఎన్‌ఎంలు ప్రాణాలకు భయపడకుండా సేవలందిస్తే రాష్ట్ర ప్రభుత్వం వారికి ప్రోత్సాహకాలు ప్రకటించకుండా కాలక్షేపం చేస్తుందన్నారు. రేషన్ డీలర్ల కమీషన్లు పెంచడం లేదు..పాఠశాలలు శిధిలమయ్యాయి.. వాలంటీర్లకు వేతనాలు లేవు.. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు..నిరుద్యోగులకు భ్రతి ఇవ్వడం లేదు ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలు ఆలోచించాలన్నారు.
నిజాంకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన రాంజీ, గోండు, చాకలి ఐలమ్మ, దిడ్డి కొంరయ్యల స్పూర్తితో 2023లో గొల్లకొండపై కాషాయం జెండాను ఎగురవేస్తామన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిజమైన తెలంగాణకు స్వాతంత్య్ర దినోత్సవంగా జరపాలని డిమాండ్ చేస్తే విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటున్నారు.. 1000 మందిని ఉరి వేసిన నిర్మల్‌లో సభ పెడితే టీఆర్‌ఎస్ వాళ్లు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు.
పోడు భూముల సమస్యలు పరిష్కరించపోతే ప్రభుత్వాన్ని ప్రజల్లో దోషిగా నిలబట్టేందుకు ప్రగతి భవన్, కేసీఆర్ ఫాం హజ్ ను ముట్టడిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. పోడు భూముల కోసం గుర్రంబోడు వద్ధ మేము పోరాడితే బీజేపీ కార్యకర్తలు, నాయకులు 30 మందిపై కేసీఆర్ కేసులు పెట్టి జైళ్లో పెట్టిందన్నారు. ధరణి పేరుతో పేదలకు ఉన్న ఒక ఎకరం.. రెండెకరాల భూములను నిషేదిత భూముల లిస్ట్ లో పెట్టి వారికి రైతు బంధు, కిసాన్ సమ్మాన్ రాకుండా అడ్డుకుంటున్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు.
హైదరాబాద్ లోని విలువైన స్థలాలను రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వం పేదల భూములను లాక్కుంటుందన్నారు. ప్రజా సంగ్రామ యాత్రకు వచ్చే ప్రజాస్పందనను ద్రష్టి మరల్చేందుకు డ్రగ్స్ కేసులో సవాల్ విసురుతున్నారని విమర్శించారు. మళ్లీ హెచ్చరిస్తున్నా.. దసరా వరకు పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రగతి భవన్ ముట్టడి తప్పదని ఆల్టీమేటం ఇచ్చారు.