కామారెడ్డి, సెప్టెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి గణేష్ నిమజ్జన శోభాయాత్రను జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్, ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికపై ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు.
పట్టణంలో మూడువందల విగ్రహాలను ఏర్పాటు చేశారని చెప్పారు. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో మండపాల నిర్వాహకులు పూజలు చేపట్టారని పేర్కొన్నారు. దశలవారీగా పట్టణంలో రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, వైస్ చైర్ పర్సన్ ఇందుప్రియ, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు గోపాలకృష్ణ, ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రభాకర్, కౌన్సిలర్లు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.