కామారెడ్డి, సెప్టెంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన ప్రజలు 2023లో ప్రభుత్వాన్ని మార్చేందుకు టీఆర్‌ఎస్‌తో యుద్ధం చేయాలని ప్రజలకు కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలన రాజ్యమేలుతుందని దానిని కూల్చాలని నినదిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుంది. 25వ రోజుకు చేరిన పాదయాత్రను పురస్కరించుకుని 300 కి.మీ చేరిన సందర్బంగా బీజేపీ జాతీయనాయకులు, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజాంసాగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం లేదు.. కుటుంబ పాలన, అవినీతి పాలన మాత్రమే కొనసాగుతోందని, ఒక కుటుంబమే రాజ్యమేలుతోందన్నారు. కేసీఆర్ ఏ హామీని నెరవేర్చలేదన్నారు. లక్షమంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసినా కొత్త నియామకాలు జరపలేదన్నారు. ఇక టీఆర్‌ఎస్ పై ఉద్యమం చేస్తామన్నారు.
హుజూరాబాద్ ఉపఎన్నికలో బిజెపిదే విజయమన్నారు. పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్ చేయడం అనేది కేవలం మోడీ ప్రభుత్వం వల్లనే సాధ్యం అయ్యిందన్నారు. ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రజల్లో పెను మార్పు తీసుకు రాబోతుందన్నారు. పేదలు, రైతులు, సామాన్యులకు న్యాయం చేసేందుకు మోడీ ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చిందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడం వల్లనే తెలంగాణలో కరోనా మరణాలు పెరిగాయన్నారు.
గత నెల 28వ తేది హైదరాబాద్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి ప్రారంభమైన బండి సంజయ్ మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరింది. 25వ రోజు కావడంతో పాటు 300 కి.మీ మైలురాయిని చేరడంతో కామారెడ్డి పట్టణంలో ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి బోనాలు, బతుకమ్మలు, ఆదివాసీ కళాకారుల బృందాలతో స్వాగతం పలికారు.