నిజాంసాగర్, సెప్టెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం సుల్తాన్ నగర్ లో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పరిశీలించారు. గ్రామంలో 100 శాతం పూర్తిచేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. నిజాంసాగర్ మండలంలో ఇప్పటివరకు 63 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు తెలిపారు. మిగిలిన 37 శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యే విధంగా చూడాలన్నారు.
ఉపాధి హామీ వర్క్ ఫైళ్లను పరిశీలించారు. చేపట్టిన పనుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని ఎంపీడీవోకు సూచించారు. నిజాంసాగర్ ఎంపిడిఓ, తహసిల్దార్ కార్యాలయాలు సందర్శించారు. ధరణి ద్వారా చేపట్టిన రిజిస్ట్రేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. దళిత బంధు పథకం ద్వారా దళితులు జీవనోపాధిని పెంపొందించుకోవాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులను సర్వే ద్వారా ఎంపిక చేపట్టాలని కోరారు.
బంజపల్లి పల్లె ప్రకృతి వనంను సందర్శించారు. మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం సంతరించుకుందని పేర్కొన్నారు. వనంలో బంతి, చామంతి, మందారం,మల్లె వంటి పూల మొక్కలు పెంచాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్‌డివో రాజా గౌడ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.