వేల్పూర్, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైందని జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నీరడీభాగ్య, అఖిలపక్ష నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నీరడి భాగ్య మాట్లాడుతూ అఖిలపక్షం నాయకులు, పలువురు రైతులు భారత్ బంద్ ను పురస్కరించుకొని వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారని, రహదారులపై తిరుగుతూ దుకాణాలు, వ్యాపార సంస్థలను, పాఠశాలలను మూసివేయించారన్నారు.
అనంతరం జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నల్ల చట్టాలను అమలు చేసి రైతు నడ్డి విరిచిందని, పెట్టుబడిదారి, అంబానీలకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం సాధ్యంకాని హామీలను ప్రజలకు ఇస్తూ మోసం చేస్తుందని, దళిత బంధు అన్ని వర్గాల ప్రజలకు అందించాలని వారు డిమాండ్ చేశారు. లేని యెడల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు గుణపాఠం చెప్పాలని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కుటుంబ పాలన జరుగుతుందే తప్ప ప్రజలకు ఏ మాత్రం మేలు జరగడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ నిద్ర మత్తు వదిలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు.