నిజామాబాద్, అక్టోబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిల్లల చిరునవ్వు, పలకరింపులతో వారి తల్లిదండ్రుల ఆరోగ్యం రెట్టింపవుతుందని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్బంగా శుక్రవారం మహిళ-శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన సీనియర్ సివిల్ జడ్జి డిఎల్ఎస్ఏ సెక్రెటరీతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, జీవితంలో ఎంతో ముందుకు వెళ్లినా, ఎన్ని పదవులు అలంకరించినా తల్లిదండ్రుల ఆశీర్వాదంతోనేనని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ అని అన్నారనీ తెలిపారు. కొందరిని వృద్ధాప్యంలో కొడుకులు, కూతుర్లు సరిగా ఆదరించకపోవడం, వారి బాగోగులు పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. కారణాలు ఏవైనా ఇది అత్యంత దురదృష్టకరం అన్నారు. వృద్ధాప్యంలో పిల్లలు నాలుగు మంచి మాటలు మాట్లాడే వారు కరువై వృద్ధుల అనుభవిస్తున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో 2014 లో చట్టాన్ని అమలులోకి తీసుకురావడం జరిగిందన్నారు.
ఈ చట్టంలో వయోవృద్ధులకు అనేక వెసులుబాట్లు, హక్కులు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. పిల్లల మీద ప్రేమ ఉన్నప్పటికీ ఒకవేళ మీ ఆలనాపాలనా చూసుకోని పక్షంలో సంబంధిత ఆర్డీవోలకు దరఖాస్తు చేసుకోవచ్చని చట్టప్రకారం ఉన్నటువంటి అంశాల ఆధారంగా సమస్యలు పరిష్కరిస్తారని ఆయన తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో వచ్చిన కేసులు వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు.
ఆర్డిఓ ఇచ్చిన ఆర్డర్ ను ఖచ్చితంగా అమలు చేయవలసిందేనని లేని పక్షంలో వారిపై క్రిమినల్ కేసులు పెట్టే విధంగా చట్టంలో అధికారం కల్పించడం జరిగిందన్నారు. కాబట్టి వృద్ధులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కేర్ సెంటర్, వృద్ధాశ్రమం నిర్మాణం పనులు పెండిరగ్లో ఉన్నవని వాటి వివరాలు తెప్పించుకొని ప్రభుత్వానికి తెలియజేసి క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి సోమవారం ప్రజావాణిలో అందుబాటులో ఉంటామని సమస్యలు తమ దృష్టికి తేవాలన్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది మన ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ముఖ్యమని మనశ్శాంతి లేకుంటే ఎంత ఆస్తి, డబ్బు ఉన్నా పనికిరావని మీరు సంపాదించిన ఆస్తి మీ పిల్లలకు ఇచ్చే సమయంలో మీకంటూ మీ వాటా ఉంచుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. తద్వారా ఆర్థికంగా ధైర్యంగా ఉండగలుగుతాం అని మిమ్మల్ని మీ పిల్లలు గౌరవిస్తారని అన్నారు.
డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ మాట్లాడుతు సీనియర్ సిటిజన్ కేసులకు సంబంధించి తొందరగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అందరికీ సహాయం చేయడానికి డి.ఎల్.ఎస్.ఎ మీకు తోడుగా ఉంటుందని తెలిపారు. అనంతరం వృద్ధులను శాలువాలతో సన్మానించారు.
కార్యక్రమంలో డిసిపి ఉషా విశ్వనాధ్, మెప్మా పిడి రాములు డిడబ్ల్యువో రaాన్సీ, వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షులు ఏం రాజేశ్వర్, వృద్ధాశ్రమం అధ్యక్షులు భూమన్న, షుకూర్, మల్లయ్య, పైపుల రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.