నిజామాబాద్, అక్టోబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఎన్.ఎస్‌యు.ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ మాట్లాడుతూ శాంతి సత్యం అహింస అనే నినాదంతో బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తరిమికొట్టి, భారతమాత దాస్య శృంఖలాలను తెగనరికి, దేశ ప్రజలకు స్వేఛ్ఛ స్వాతంత్య్రాలను తీసుకురావాలని నిశ్చయించుకొని అందుకోసం తన జీవితం మొత్తాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అన్నారు.
ఆయన శాంతి, సత్యం, అహింస సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం లాంటి ఉద్యమాలు దేశ ప్రజలలోనే కాదు ప్రపంచ దేశాల ప్రజలు, నాయకుల్లో కూడా ఎంతో ఓర్పును నేర్పును తీసుకురావడానికి దోహదపడ్డాయని, అంతర్జాతీయ స్థాయిలో అనేకమంది దేశాధినేతలు ఆయన విధానాలను సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నారని ఆయన అన్నారు.
ఆయుధ బలం కంటే ఆత్మబలం గొప్పదని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప ఆత్మ బలుడు మహాత్మా గాంధీ అని, ప్రతి పౌరుడు పాలకుల నిరంకుశత్వానికి ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంకల్ప బలంతో నిరంతరంగా నిజాయితీగా ఆత్మస్థైర్యం కోల్పోకుండా పోరాటాన్ని సాధించినప్పుడు ఎంత పెద్ద సామ్రాజ్యాధినేత అయిన తప్పకుండా భయపడతారని ప్రజాపోరాటాలకు తలవంచుతారని, బలమైన పోరాటాలకు ఎటువంటి దాడులు, అప్రజాస్వామిక, అనాగరిక, ఆటవిక చర్యలు ఉంటాయో అక్కడి ప్రజలకు శాంతి, సంతోషం, ప్రగతి, రక్షణ ఉండవని మహాత్మా గాంధీ చెప్పిన ఆణిముత్యాల్లాంటి అక్షర సత్యాన్ని ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరముందన్నారు.
మహాత్మా గాంధీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించాలంటే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వాదాన్ని, రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని, పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ చక్రి దత్తాత్రి, ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు వరుణ్ సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి వేదమిత్ర, నాయకులు శివ, అరవింద్, గణేష్, రిషి, ముస్సు పటేల్ తదితరులు పాల్గొన్నారు.