వేల్పూర్, అక్టోబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలో గతనెల 28, 29 న కురిసిన భారీ వర్షాల కారణంగా పచ్చల నడుకుడ పెద్దవాగుపై నిర్మించిన చెక్ డాం తెగిపోవడం వలన భూమిని, పంటను కోల్పోయిన రైతుల పంటపొలాలను మండల వ్యవసాయ అధికారి నరసయ్య, సర్పంచ్ శ్వేత గంగారెడ్డి, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నష్టపోయిన రైతుల పంట వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి నరసయ్య మాట్లాడుతూ అధిక వర్షాల కారణంగా వరద ఉదృతికి పచ్చల నడుకుడ గ్రామంలో 12 నుండి 15 ఎకరాల భూమి కోతకు గురి అయిందని వారి పట్టా బుక్, పాస్ బుక్, ఆధార్ కార్డు వివరాలను సేకరించి నివేదిక పంపించడం జరుగుతుందని తెలిపారు. పచ్చల నడుకుడ లో సుమారు 60 ఎకరాల వరి పంట, 30 ఎకరాల సోయా మొక్కజొన్న పంట నష్టం జరిగినట్లు తెలిపారు.
నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి పంట వివరాలతో పై స్థాయి అధికారులకు నివేదిక ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా మండలంలోని మోతే, అక్లూర్, రామన్నపేట్, కొత్తపల్లి గ్రామాలలో పంట నష్టం వాటిల్లిందని వాటి నివేదికలను కూడా స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. మండలంలో సుమారు 450 ఎకరాల వరి, 200 నుండి 250 ఎకరాల మొక్కజొన్న పంట, 200 ఎకరాల సోయా పంట నష్టం జరిగిందని తెలిపారు.
మొత్తం నివేదికను సేకరించి పై స్థాయి అధికారులకు పంపడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నరసయ్య, ఏఇవో సంధ్య, సర్పంచ్ శ్వేత గంగారెడ్డి, నష్టపోయిన పంట రైతులు పాల్గొన్నారు.