నిజామాబాద్, అక్టోబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అందరూ సుఖ:సంతోషాలతో బతకాలని బతుకునిచ్చే బతుకమ్మ పండుగ ప్రారంభరోజు అయిన ఎంగిలిపూల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల మహిళలకు ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఎంతో ఇష్టంతో పూలను పేర్చి, గౌరమ్మను తీర్చి కోరిన కోరికలు ఫలించాలనే నమ్మకంతో బతుకమ్మ పండగ జరుపుకుంటారని, అది ఎంగిలిపూల బతుకమ్మతో మొదలవుతుందని అన్నారు.
తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండగ, పువ్వులను పూజించే పండుగ, తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఉండే పండగ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజలందరినీ ఏకం చేసిన పండగ కావడంతో ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ రాష్ట్రం రాగానే బతుకమ్మ పండగను రాష్ట్ర పండగగా ప్రకటించి, ఈ పండుగ సంతోషంగా జరుపుకోవాలని ఏటా కోటి మందికి రంగురంగుల్లో, అనేక డిజైన్లలో రూపొందించిన చీరెలు తండ్రిగా, అన్నగా, మేనమామగా అందిస్తున్నారని తెలిపారు.
ఇంతటి విశిష్టమైన పండగను ఆడపడచులంతా తంగేడు పూలు, గునుగు పూలు, బంతిపూలు, చామంతులతో అందంగా పేర్చి సాయంత్రం అందరూ ఒక చోట కూడి చప్పట్లతో సందడిగా చేసుకునే పండగ తెలంగాణ అస్థిత్వానికి ప్రతీక వంటిందన్నారు. తంగేడుపూల బతుకమ్మ కావడంతో తంగేడు పూవును రాష్ట్ర పూవుగా ప్రకటించి, బతుకమ్మ ప్రాధాన్యతను ముఖ్యమంత్రి కేసిఆర్ చాటారన్నారు.