నిజామాబాద్, అక్టోబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చాలా రోజుల తర్వాత మళ్లీ పండగ వాతావరణం కనిపిస్తుందని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం టీఎన్జీవోస్, ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఇరిగేషన్ శాఖ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ ఉత్సవాల కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్‌తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
టీఎన్జీవోస్ శాఖ అధ్యక్షులు అలుక కిషన్ అధ్యక్షత వహించారు. బతుకమ్మ పూజ కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలు చాలా రోజుల తర్వాత నిర్వహించుకుంటున్నామని గత సంవత్సరన్నర కాలంగా ఎవరిని కలవాలన్న భయంతో గుంపులుగా ఉంటే ఎక్కడ కోవిడ్ వస్తుందొనని భయంతో పండుగలు చాలా వరకు ఇంటికే పరిమితం చేసుకున్నాం అన్నారు.
వ్యాక్సినేషన్ పెరగడం వలన, అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాల వల్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ రోజు మనకు కరోనా తగ్గుముఖం పట్టి సాధారణ జీవనం కొనసాగిస్తున్నామని, టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ జరుపుకోవడం చాలా సంతోషదాయకం అన్నారు. బతుకమ్మ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటుతూ ఈ ప్రాంత ప్రజలందరూ ఒక్కతాటిపైకి రావడం జరిగిందని తెలిపారు.
బతుకమ్మ పండుగ అంటే ఆడబిడ్డల పండుగ అన్నారు. నిజామాబాద్ టీఎన్జీవోస్ శాఖ చాలా వరకు ఒక మంచి ఆదర్శంగా ముందుకు వెళుతున్న శాఖ అని, ఎప్పుడు అందరితో పాటుగా కరోనాతో ఆటుపోట్లు చూస్తున్న చాలాసార్లు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలలోకి తీసుకు వెళుతూ అదేవిధంగా ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళడం మంచి వాతావరణం అలవాటు అని అది కంటిన్యూ కావాలి అన్నారు.
ఈ సందర్బంగా జిల్లా ప్రజలందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు, ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ ప్రధాన కార్యదర్శి అమృత్, మహిళా అధ్యక్షురాలు సునీత, వివిధ శాఖల ఉద్యోగులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాల్గొన్నారు.