నిజామాబాద్, అక్టోబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 25 నుండి నిర్వహించే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు అన్ని ముందస్తు ఏర్పాట్లతో పకడ్బందీగా నిర్వహించుటకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులకు సూచించారు.
బుధవారం ఆయన ఛాంబర్‌లో పరీక్షలపై సంబంధిత అధికారులతో ఏర్పాట్ల కొరకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో గత విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనందున ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈనెల 25 నుండి నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఈ పరీక్షలు నవంబర్ 1వ తేదీ వరకు కొనసాగుతాయని ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష సమయం ఉంటుందని, 71 కేంద్రాలలో 18697 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించుటకు పోలీస్ బందోబస్తు, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లను పరీక్షల సమయంలో మూసి ఉంచాలని, కరోనా జాగ్రత్తలలో భాగంగా శానిటేషన్ చేయాలని, ఒక్కో బెంచీలో ఇద్దరు విద్యార్థులను మాత్రమే కూర్చునే విధంగా ఏర్పాటు చేయాలని, పరీక్ష సమయంలో నిరంతర విద్యుత్తు సరఫరా ఉండేవిధంగా చూడాలని, పరీక్ష కేంద్రాలలో తాగునీరు ఇతర కనీస సదుపాయాలు ఉండేలా చూడాలని, గ్రామీణ స్థాయి విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడానికి అనుకూలంగా బస్సులు నడపాలని అధికారులకు సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లో కూడా అభ్యర్థులు ఒక నిమిషం లేటైనా పరీక్షకు అనుమతించడం జరగదని అంతేకాక పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, సెల్ ఫోన్లు కానీ అనుమతించరని విద్యార్థులు సమయానికంటే ముందుగానే తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు హాజరుకావాలని ఒక రోజు ముందుగానే పరీక్ష కేంద్రాలను సరి చూసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు డిసిపి గిరిరాజ్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రఘురాజ్, సంబంధిత అధికారులు హాజరయ్యారు.