కోవిడు నిబంధనలతో ఇంటర్‌ పరీక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ నిబంధనలతో ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్‌ విద్యాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని, విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయవచ్చని అడిషనల్‌ కలెక్టర్‌ బి చంద్రశేఖర్‌ అన్నారు. ఈనెల 25వ తేదీ నుండి ప్రారంభం కానున్న మొదటి సంవత్సరం ఇంటర్‌ పరీక్షల నిర్వహణ నిమిత్తం సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారుల సమావేశం బుధవారం న్యూ అంబేద్కర్‌ భవన్‌లో నిర్వహించారు.

సమావేశానికి జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘు రాజ్‌ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా అడిషనల్‌ కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. రెవెన్యూ, పోలీస్‌, ఆర్టీసీ, విద్యుత్‌, వైద్య అధికారులతో చర్చించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పట్టణాల్లో మున్సిపల్‌ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామపంచాయతీ అధికారులతో మాట్లాడి ఇంటర్‌ పరీక్షల కోసం పరీక్షా కేంద్రాలు శుభ్రం చేయడం, శానిటేషన్‌ చేయించడం జరుగుతుందని అన్నారు.

అలాగే మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు కలిగిన ఐసోలేషన్‌ రూములు కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రఘురాజు మాట్లాడుతూ చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు పరీక్షల నిర్వహణకు నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అన్నారు. జిల్లాలో ఈసారి కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా 71 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో కోవిడ్‌ కారణంగా మార్చిలో వాయిదా పడినందున పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.

చీఫ్‌ సూపరిండెంట్‌లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు పరీక్షల ముందు పరీక్షల నిర్వహణ పరీక్ష తర్వాత చేపట్టవలసిన చర్యలను అన్నింటినీ చాకచక్యంగా నిర్వహించాలని అన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పరీక్ష నిర్వహణకు సిబ్బంది, అధ్యాపకులు, ఇన్విజిలేషన్‌ చేసే అధ్యాపకులు అందరూ రెండు డోసులు వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్న వారిని నియమిస్తున్నామని అన్నారు. విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే ముందు కోవిడ్‌ నిబంధనలు పాటించాలని అన్నారు. ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించి పరీక్ష కేంద్రంలోకి వచ్చేముందు శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని అలాగే విద్యార్థులకు అవసరమైన మంచి నీటి బాటిల్‌ శానిటేషన్‌ బాటిల్‌ తెచ్చుకుంటే మంచిదని అన్నారు.

అలాగే చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా నిబంధనల ప్రకారం పనిచేయాలని అన్నారు. ఈసారి కొత్తగా బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ వారు కొత్త యాప్‌ ప్రవేశపెట్టిందని దీని ద్వారానే విద్యార్థుల గైర్హాజర్‌ వివరాలు బ్లాంక్‌ ఓఎంఆర్‌ వివరాలు తదితర విషయాలన్నీ కూడా నేరుగా బోర్డుకు పంపాల్సి ఉంటుందని అన్నారు. విద్యార్థులు తమ హాల్టికెట్లను బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఈ హాల్‌ టికెట్‌పై ప్రిన్సిపాల్‌ సంతకం అవసరం లేదని తెలిపారు.

అలాగే మొదటి సంవత్సరం చదివి రెండవ సంవత్సరం ఇతర కళాశాలలో చేరిన విద్యార్థులు మొదటి సంవత్సరం చదివిన కళాశాల ద్వారా పరీక్షలకు హాజరుకావాలని తెలిపారు. సమావేశంలో జిల్లా ఇంటర్‌ పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు రవి కుమార్‌, చిరంజీవి, కనకమహాలక్ష్మి, హైపవర్‌ కమిటీ చిన్నయ్య, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల సంఘం అధ్యక్షులు చంద్ర శేఖర్‌, ప్రధాన కార్యదర్శి సి.నారాయణ, బల్క్‌ అధికారి రాజీ ఉద్దీన్‌, ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్‌లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు, చీఫ్‌ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »