కామారెడ్డి, అక్టోబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో 343 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.1960, సాధారణ రకంకు రూ.1940 చెల్లిస్తున్నట్లు చెప్పారు. రైతులు పండిరచిన ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా శుభ్రపరిచి, ఎండబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.
జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08468 220051 కు సమస్యలున్నవారు తెలియజేయాలని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు ఉంటే మండల స్థాయి కమిటీలకు తెలియజేసి పరిష్కరించుకోవాలని చెప్పారు. మండల స్థాయిలో పరిష్కారం కాకపోతే డివిజన్ స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసుకోవాలని కోరారు.
ఈసారి 5 లక్షల 80 వేల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేయడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. రైతులు ధాన్యం విక్రయించిన సమయంలోనే పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం, ఆధార్‌కార్డు నకలు అందజేస్తే డబ్బులు తక్షణమే అందే వీలుందని సూచించారు.
రైతులకు సహకార సంఘాల కార్యదర్శులు అవగాహన కల్పించాలని కోరారు. కొనుగోలు కేంద్రాల నుంచి పంపిన లారీలను రైస్ మిల్లర్లు 12 గంటల లోపు అన్‌లోడిరగ్ చేసే విధంగా చూడాలని పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జెడ్పి చైర్ పర్సన్ శోభ, ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, సివిల్ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్, ఎంపీపీలు, జడ్పిటిసి సభ్యులు, సహకార సంఘాల చైర్మన్లు, కార్యదర్శులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.