యాసంగి (రబీ) లో వరి సాగు వద్దే వద్దు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో వచ్చే యాసంగిలో వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసే విధంగా అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో వ్యవసాయ, అనుబంధ, పోలీస్‌, విత్తన తదితర శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వచ్చే రబీలో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు ఒక్కో సీజన్‌కు రెండు లేదా రెండున్నర లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం వచ్చేదని గత రెండు మూడు సీజన్ల నుండి ఈ దిగుబడి మూడిరతలు నాలుగింతలు పెరిగిందని తద్వారా ఎఫ్‌సిఐ కొనుగోలు చేసే సామర్థ్యం రెండు సీజన్లకు కలిపి ఒకేసారి వస్తున్నందున రెండు సీజన్ల ధాన్యాన్ని కొనడానికి ఎఫ్‌సిఐ సిద్ధంగా లేదన్నారు. అందువల్ల రెండు సీజన్ల ధాన్యం కొనుగోలు ఈ వానాకాలం సీజన్‌లోనే లక్ష్యాన్ని దాటనున్నందున రబీలో ఎఫ్‌సిఐ ద్వారా ధాన్యం కొనుగోలుకు అవకాశం ఉండకపోవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఈ యాసంగిలో వరి పంట సాగు చేస్తే డిమాండ్‌ లేకపోవడం వల్ల పలు సమస్యలు ఎదుర్కొంటారని, ఇబ్బందులు పడతారని అన్నారు. కావున తప్పనిసరిగా వచ్చే యాసంగిలో వరి సాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలనే వ్యవసాయ అధికారులు సూచించాలని స్పష్టం చేశారు.

విత్తన డీలర్లు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని వరి విత్తనాలు బదులు ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఒకవేళ ఎవరైనా రైతులు వరి విత్తనాలు కొనుగోలుకు వస్తే వారు దేని గురించి సాగు చేస్తారో, ఇతర వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

ఇందుకు సంబంధించి రైతు వేదికల ద్వారా వెంటనే అవగాహన, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రైతులను చైతన్యం చేసి వారు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే విధంగా చూడాలని ఈ కార్యక్రమాలలో వ్యవసాయ అధికారులు, తహసీల్దార్లు, ఎస్‌ఐలు పాల్గొని కార్యక్రమాలు విజయవంతం అయ్యే విధంగా చూడాలని తెలిపారు.

అదేవిధంగా వ్యాపారులు ఎర్ర జొన్న, గడ్డి విత్తనాలు విక్రయించే ముందు బైబ్యాక్‌ అగ్రిమెంట్‌ ఉంటేనే విక్రయించాలని, రైతులను మోసం చేస్తే లేదా వారికి నష్టం చేస్తే యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుందని, రైతులు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టరు చంద్రశేఖర్‌, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌, శాస్త్రవేత్తలు నవీన్‌ కుమార్‌, బాలాజీ, హార్టికల్చర్‌ అధికారి నర్సింగ్‌ దాస్‌, ఆర్‌డివోలు రాజేశ్వర్‌, రవి, శ్రీనివాస్‌, డి.ఎం సీడ్స్‌, రైస్‌మిల్లర్స్‌ సంఘం ప్రతినిధులు, డీలర్స్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »