నిజామాబాద్, అక్టోబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంగా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్‌తో టెంపరేచర్ పరీక్షించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్ని కేంద్రాల ఛార్జీలను, అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఆయన పరీక్షలు జరుగుతున్న కేంద్రాలలో పర్యటించి పరిశీలించారు. స్థానిక కంఠేశ్వర్‌లో గల ఉమెన్స్ కాలేజ్, గంగాస్థాన్‌లో గల ఎస్‌ఆర్ జూనియర్ కాలేజ్‌లలో పరీక్ష కేంద్రాలను సందర్శించారు. మంగళవారం ఇంగ్లీష్ పేపర్ జరుగుతుండగా కంటేశ్వర్‌లోని ఉమెన్స్ కాలేజ్‌లో పరీక్షకు 327 మొత్తం హాజరు కావలసి ఉండగా 315 విద్యార్థులు హాజరు కాగా 12 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, ఎస్‌ఆర్ జూనియర్ కాలేజీలో పరీక్షకు 238 విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 224 హాజరయ్యారని 14 విద్యార్థులు గైర్హాజర్ అయ్యారని సంబంధిత అధికారులు తెలిపారు.
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కొవిడ్ దృష్టిలో పెట్టుకొని పరీక్ష కేంద్రాలలో ధర్మల్ స్క్రీనింగ్‌తో టెంపరేచర్ పరిశీలించాలని, భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరి ధరించాలని, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని, విద్యార్థులకు తాగునీరు, మెడికల్ కిట్స్ అందుబాటులో ఉంచాలని అధికారులకు తెలిపారు.
ఉమెన్స్ కాలేజ్ ఆవరణలో ఖాళీ స్థలం ఉండటం గమనించి ప్రిన్సిపాల్‌తో హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని తెలిపారు. కలెక్టర్ వెంబడి ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ భారతి రెడ్డి, ఎస్‌ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.