పని చేసిన వారిని ప్రజలే కడుపులో పెట్టుకుని చూసుకుంటారు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌ మండలం లక్కోర గ్రామం, భీంగల్‌ మండలం సికింద్రాపూర్‌ గ్రామాల్లో 14 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మొత్తం 20 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల రెండు గొడౌన్లకు శుక్రవారం రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. 24 లక్షల వ్యయంతో నిర్మించిన సికింద్రాపూర్‌ పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభించారు. తరగతి గదుల నిర్మాణానికి ముందుకు వచ్చిన స్థానిక ఎంపిటిసికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అట్లాగే ఏర్గట్ల మండల కేంద్రంలో 7.5 లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్సి కమ్యూనిటీ హాల్‌, 5 లక్షల వ్యయంతో నిర్మించిన నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్‌లను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న రైతు ప్రయోజన కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా సాగు నీరు, విరివిగా నిర్మించిన చెక్‌ డ్యాముల, చెరువులు పూడికతీత ద్వారా గ్రౌండ్‌ వాటర్‌ పెరిగి కొత్తగా ఏర్పాటు చేసుకుంటున్న బోర్ల ద్వారా ఎకరం కూడా బీడు లేకుండా సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. రైతులకు ఎకరానికి 10 వేల పెట్టుబడి సాయం, రైతు భీమా, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌, ఎక్కడికక్కడ పంట కొనుగోలు లాంటి ఎన్నో రకాల రైతు ప్రయోజన కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఆహార ధాన్యం పంట దిగుబడి గతంలో కంటే ఈ ఏడు సంవత్సరాల్లో ఐదు రెట్లు పెరిగిందని చెప్పారు.

ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో ఒక్క ఎకరం కూడా బీడు భూమి లేదని స్పష్టం చేశారు. పండిరచిన ఆహార ధాన్యాలు ఎక్కడ నిల్వ చేసుకోవాలనే ఆలోచనలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొడౌన్స్‌ నిర్మిస్తున్నారని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని కిసాన్‌ నగర్‌లో 5 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల ఒకేఒక్క పాత గొడౌన్‌ ఉండేదని అన్నారు. కానీ కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే 11 కొత్త గొడౌన్స్‌, 9 ఇప్పటికే పూర్తయి వినియోగంలో ఉన్నవి 2 శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. వీటి వల్ల 57 వేల 250 మెట్రిక్‌ టన్నుల పంట నిల్వ చేసుకోవచ్చని తెలిపారు.

వేల్పూర్‌, మోర్తాడ్‌, కమ్మర్పల్లి, రెంజర్ల, భీంగల్‌, కిసాన్‌ నగర్‌, ఏర్గట్ల, బాల్కొండలో ఇప్పటికే గొడౌన్స్‌ అందుబాటులో ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వాల 60 ఏండ్ల హయాంలో నిర్మించింది కేవలం ఒక్క 5వేల మెట్రిక్‌ టన్నుల గొడౌన్‌ మాత్రమే అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత 57 వేల మెట్రిక్‌ టన్నుల గొడౌన్స్‌ అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. మాట్లాడే వారు అడ్డగోలుగా ఎన్నైనా మాట్లాడతారని ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు.

ఈ అభివృద్ధి మీ కళ్లకు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. చూస్తూ కూడా చూడనట్లు, మీకు ఏమి కనబడనట్లు నటిస్తే, ఏదో విమర్శించాలని విమర్శిస్తే ఎవరూ ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని రకాలుగా విమర్శలు చేసినా పని చేసుకుంటూ పొమ్మని కేసీఆర్‌ మాకు ఎప్పుడూ చెప్తారని, పని చేసిన వారిని ప్రజలే కడుపులో పెట్టుకుని చూసుకుంటారని అంటారన్నారు.

గతంలో ఎట్లుండే..కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లున్నదో రైతన్నలు దయచేసి గమనించాలని మంత్రి కోరారు. బాల్కొండ అభివృద్ధికి నిరంతరం సహకారాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అడిగిన వెంటనే 20 వేల మెట్రిక్‌ టన్నుల గొడౌన్స్‌ను సాంక్షన్‌ చేసిన మార్కెటింగ్‌ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డికి మంత్రి వేముల బాల్కొండ నియోజకవర్గ ప్రజలు, రైతాంగం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో స్ధానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »