నిజామాబాద్, అక్టోబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి చైతన్యం చేయాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ విద్యార్థులకు, విద్యా సంస్థలకు సూచించారు. స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో శుక్రవారం జిల్లా స్థాయి ఓటర్ అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ అర్హతగల ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవడంతో పాటు కొత్తగా వచ్చిన వారి పేర్లను చేర్చి చనిపోయిన వారి పేర్లను తొలగించడం ద్వారా చిరునామా సరి చేయడం ద్వారా ఆ జాబితాను ఎటువంటి తప్పులకు అవకాశం లేకుండా సిద్ధం చేయడానికి వీలవుతుందని పేర్కొన్నారు.
ఇందుకు ఎలక్టోరల్ లిటరసీ క్లబ్బులను ఫామ్ చేసి వారిద్వారా ప్రజలలో అవగాహన కల్పించాలని అన్ని విద్యా సంస్థలు సంస్థల యాజమాన్యాలు కార్యక్రమాల్లో భాగస్వాములై తనవంతుగా బాధ్యతను నిర్వర్తించాలని పేర్కొన్నారు. నవంబర్ 6, 7, 27, 28 తేదీలలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున అన్ని పోలింగ్ కేంద్రాలలో బిఎల్‌వోలు సంబంధిత ఫారాలతో అందుబాటులో ఉంటారని ప్రతి ఒక్కరు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు కొత్తగా నమోదుకు దరఖాస్తు చేసుకుని స్వచ్ఛమైన ఓటర్ జాబితా సిద్ధం చేయడానికి సహకరించాలని ఆయన కోరారు.
సమావేశంలో డిసిఓ సింహాచలం, ఆర్డీవో రవి, జిల్లా పరిషత్ సీఈవో గోవింద్ నాయక్, జిల్లాలోని అన్ని హై స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు, జూనియర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, బూత్ లెవెల్ అధికారులు పాల్గొన్నారు.