పోడు, సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నలభై సంవత్సరాలుగా సాగుచేస్తున్న పోడు, సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని పట్టాలు ఇచ్చిన భూములలో ఫారెస్ట్‌ అధికారుల అడ్డంకులు తొలగించి శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని శుక్రవారం సాయంత్రం మంత్రి ప్రశాంత్‌ రెడ్డిని ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్‌ నాయకత్వంలో జిల్లా బృందం వేల్పూరులో మంత్రి నివాసంలో కలిశారు.

ఈ సందర్భంగా ఏఐకెఎమ్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌ ప్రశాంత్‌ రెడ్డికి జిల్లాలో పోడు, సాగు భూముల సమస్యలను లిఖితపూర్వకంగా వ్రాసిన మెమోరాండం ఇచ్చి వివరించారు. ప్రధానంగా నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల సర్వేనెంబర్‌ 532 లో 2008 లో ఆనాడు జాయింట్‌ సర్వే నిర్వహించి పట్టాలు ఇచ్చిన భూమిని ఫారెస్ట్‌ అధికారులు అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడుతూ సాగుకు అడ్డు పడుతుంటే హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులు పూర్తిస్థాయిలో న్యాయస్థానం వాదనలు ప్రతి వాదనలు విన్న తర్వాత 2015 లోనే పరిష్కారం చూపుతూ హై కోర్టు తీర్పు వెలువరించినా అధికారులు నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరించిన తీరును ప్రభాకర్‌ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

లబ్ది దారులు సాగు చేసుకునేందుకు వెళ్ళిన ప్రతి సందర్భంలో అధికారులు సాగుకు అడ్డుపడుతూ వస్తున్నారని వారికి న్యాయం చేయాలని ఆయన అన్నారు. బొడ్డు మామిడి చెరువు కింద ఉన్న 532 భూమిని లబ్ధిదారులైన ఎస్సీ, బీసీ, మైనార్టీలు కాకపోయి ఉంటే ఇట్టి భూమి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కాళ్ల కింద ఉండేదని వివరించారు. ఇట్టి విలువైన భూమిని పేదలకు దక్కకుండా చేసే కుట్ర జరుగుతుందని ఆయన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ఇప్పటికీ పదుల సార్లు జాయింట్‌ సర్వే జరపగా భూమి రెవెన్యూ శాఖకు చెందినదే అని తేలింది. చివరగా శాటిలైట్‌ ద్వారా సర్వే చేసిన కూడా రెవెన్యూ శాఖ భూమి అని తేలింది కానీ అటవీ అధికారులు నివేదికపై సంతకం చేయడానికి నేటికీ నిరాకరిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కోర్టు తీర్పు ప్రకారం ఒకవేళ ఇట్టి భూమి అడవి శాఖదే అయితే ఇతర చోట చూయించాలని ఉన్నా కోర్టు తీర్పు ప్రకారం వారు నివసించే గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలో కేటాయిస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయని, ఒక్కో లబ్ధిదారుడికి ఒక ఎకరం అంత దూరం ఇవ్వటం అనేది పేదలకు పూర్తిగా అన్యాయం చేయడమే అవుతుందని అలా జరిగితే వారు భూముల సాగుకు దూరమవుతారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

అట్లాగే సిరికొండ మండలంలోని గడుకోల్‌ గ్రామంలో సర్వేనెంబర్‌ 100 లో సుమారు 80 ఎకరాల రెవెన్యూపట్టా భూమిని అక్రమంగా కందకాలు కొట్టి సాగుకు అడ్డుపడుతున్నారని ఇట్టి భూమికి ప్రభుత్వ సిఎల్‌డిపి నిధుల నుండి అభివృద్ధి చేసుకున్న కూడా అక్రమంగా కందకం కొట్టి ఇబ్బందులు పెడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పై రెండు గ్రామాల సమస్యను కచ్చితంగా పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చారు.

అట్లాగే జిల్లాలో సిరికొండ మండలంలో గల తూంపల్లి, పాకాల, చీమన పల్లి, కొండాపురం తాటిపల్లి జిని గలతో పాటు భీమ్‌గల్‌ మండలంలో దేవక్క పేట గంగారాయి దేవునిపల్లి, మెండోరా, రహమత్‌ నగర్‌, కమ్మర్‌పల్ల్లి మండలంలోని పలు గ్రామాల భూముల సమస్యపై వివరించగా మంత్రి ప్రశాంత్‌ రెడ్డి సానుకూలంగా స్పందించి ఇట్టి భూములకు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపుతానని ఆయన హామీ ఇచ్చారు.

జిల్లా కలెక్టర్‌కి తాను వ్యక్తిగతంగా ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం చూపే విధంగా చర్యలు చేపడతామన్నారు. అయితే మళ్లీ పోడు కొట్టడానికి వీల్లేదని ప్రభుత్వం నిర్ణయం అని మంత్రి చెప్పగా ఈ నిర్ణయానికి పూర్తిస్థాయిలో ఏఐకెఎంఎస్‌ ప్రభుత్వానికి, పర్యావరణ రక్షణకు తమ వంతు సహాయంగా ప్రజా చైతన్యం చేయుటకు ప్రభాకర్‌ మంత్రికి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర నాయకులు దేవారం, జిల్లా ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌ సురేష్‌, డివిజన్‌ కార్యదర్శి కె రాజేశ్వర్‌, నాయకులు బి బాబన్న, ఆర్‌ దామోదర్‌, పీవోడబ్ల్యూ నాయకురాలు సత్యమ్మ, తదితరులు ఉన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »