ఆర్మూర్, నవంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఆర్మూర్ పట్టణ కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, బిజెపి ఆర్మూర్ ఇంచార్జ్ న్యాలం రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ కెసిఆర్ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడడం మొదలైందని హుజురాబాద్ ఎన్నికల ఫలితాలే ఋజువని పేర్కొన్నారు.
అధికార దుర్వినియోగం, బంధుప్రీతి తప్ప కేసిర్ ఏనాడు పేద ప్రజల అభివృద్ధి కోసం పాటు పడలేదని, కెసిఆర్ తన కుటుంబం గురించి ఆలోచించడమే తప్ప పేద ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించక పోవడం, నిరుద్యోగులకై ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, పేదలకు డబుల్ బెడ్ రూమ్‌లు ఇవ్వకపోవడం, అర్హులైన పేద ప్రజలకు రకరకాల పెన్షన్స్ కూడా ఇవ్వకపోవడం ఇవన్నీ చూస్తుంటే మాయమాటలు చెప్పి ప్రజలను మోసగించడం తప్ప రాష్ట్ర అభివృద్ధి పట్ల ఎటువంటి ఆలోచనచేయకపోవడం, అభివృద్ధి విషయంలో ముందస్తుగా ఎటువంటి ప్రణాళికలు చేయకపోవడం, అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేకపోవడం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధిపై ఉన్న నిర్లక్ష్యపు ధోరణికి నిదర్శనం అన్నారు.
హుజరాబాద్‌లో ప్రజలను ప్రధానంగా డబ్బులతో కొనచ్చు అనేటువంటి మూర్ఖపు ఆలోచనతో వెళ్లి ప్రజల న్యాయమైన తీర్పు వల్ల, హుజురాబాద్ ప్రజలు కెసిఆర్‌కు కర్రు కాల్చి వాత పెట్టడంతో ఖంగుతిన్న కేసీఆర్ ఇప్పటికైనా కుటుంబ పాలన నుండి బయటికి వచ్చి ప్రజల అభివృద్ధి పాలన వైపు ఆలోచించాలని లేనట్లయితే రాబోయే కాలంలో ఈ ప్రజలే టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని, అదేవిధంగా రాష్ట్రంలో అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని కోరుతూ ఈనెల 9వ తేదీన ట్యాంక్ బండ్‌పై ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహం ముందు ‘‘దళిత బంధు – డప్పుల మోత’’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు.
నిరుద్యోగ సమస్య పైన ఈనెల 16న నిరుద్యోగ మిలియన్ మార్చ్, ఛలో హైదరాబాద్ నిర్వహిస్తున్నామని, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత పాదయాత్ర ఈ నెల 21 నుండి ప్రారంభం అవుతుందని కార్యక్రమాల విజయవంతానికై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.
సమావేశంలో బిజెపి ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆకుల రాజు, దుగ్గి విజయ్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, విజయానంద్, నిజామాబాద్ పార్లమెంట్ దళిత మోర్చా కన్వీనర్ నల్ల రాజారాం, బిజెపి సీనియర్ నాయకులు ద్యాగ ఉదయ్, శికారి శ్రీనివాస్, కౌన్సిలర్ బ్యావత్ సాయికుమార్, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంతం మురళి, బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు, గోవింద్ పేట్ సొసైటీ వైస్ చైర్మన్ తూర్పు రాజు, బిజెపి ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు పాన్ శీను, ధోండి ప్రకాష్, కార్యదర్శి ఖాంధేశ్ ప్రశాంత్ బిజెపి, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.